Flydubai-Fz1073-Cockpit-Attack-Mystery : స‌స్పెన్స్‌..థ్రిల్ల‌ర్ ..! Andhra Prabha Crime Story

Flydubai-Fz1073-Cockpit-Attack-Mystery : స‌స్పెన్స్‌..థ్రిల్ల‌ర్ ..! Andhra Prabha Crime Story

  • పైల‌ట్ దాడి ఎందుకు ?
  • విమానం కూల్చివేత ల‌క్ష్య‌మా. 2
  • కాక్ పిట్ లో దాడి ఓ మిస్ట‌రీ.
  • ఉగ్ర‌కుట్ర కోణంపై అనుమానం
  • ద‌ర్యాప్తు అధికారులు బిజీబిజీ
  • ఇటు ఇజ్రాయెల్‌.. అటే దుబాయ్ లో ఉత్కంఠ‌

( జెరూసలేం/దుబాయ్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ప్రయాణికుల విమానంలో కో-పైలట్‌.. కెప్టెన్‌పై దాడి చేయడం కలకలం రేపింది. 170 మందికి పైగా ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేందుకు అతడు ప్రయత్నించాడా? అసలు దాడి వెనుక ఉద్దేశమేంటి? అతడి నేపథ్యం ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను వెంటాడుతున్నాయి. బుధవారం దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్‌ FZ1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాక్‌పిట్‌లోనే కెప్టెన్‌పై దాడి

విమానం సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్‌ కెప్టెన్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ ఎలాగోలా కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు లోపలికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
విమానంలో ఉన్న రిజర్వ్‌ సిబ్బంది నియంత్రణ చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానం సౌదీ గగనతలంలో ఉన్న సమయంలో కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయినట్లు సమాచారం.

దాడి వెనుక ఉద్దేశమేంటి?

ఈ ఘటనపై సౌదీ అరేబియాలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వ్యక్తిని సౌదీ అధికారులు విచారిస్తున్నారని తెలిపారు. అనంతరం అతడిని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు అప్పగించే అవకాశం ఉందన్నారు.‘‘ఈ దర్యాప్తును మేం పరిశీలిస్తాం. అవసరమైతే ఇందులో పాల్గొనే అవకాశం కూడా ఉంది’’ అని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు చెప్పారు.ఈ ఘటన వెనుక ఇరాన్‌ ప్రమేయం ఉందా? అని ప్రశ్నించగా.. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు.
‘ఈ వ్యక్తి వెనుక అసలు ఉద్దేశమేంటి? అతడికి సహచరులు ఉన్నారా? ఇరాన్‌ ప్రమేయం ఉందా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఇరాన్‌ ప్రమేయం ఉందని ఇజ్రాయెల్‌ నుంచి అధికారికంగా ఎలాంటి ఆరోపణ రాలేదు.

ఉగ్ర చర్యగా అనుమానం ?

ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ బుధవారం మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం కో-పైలట్‌ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు తమకు తెలుస్తోందన్నారు. అతడిని ‘ఉగ్రవాది’గా అభివర్ణించారు.అయితే నెతన్యాహు మాత్రం ఈ ఘటనను ప్రస్తుతం ‘‘తీవ్రమైన భద్రతా ఘటన’’గానే పేర్కొన్నారు. దాడి వెనుక అసలు ఉద్దేశం, కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

యూఏఈలోనూ దర్యాప్తు

విమానం యూఏఈలో రిజిస్టర్‌ అయి ఉండటంతో ఈ ఘటనపై యూఏఈ న్యాయ అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. దాడికి కారణాలు, ఉద్దేశాలను గుర్తించడంతోపాటు.. ఘటనకు ఉగ్రవాద సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళికతో జరిగిందా? ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? అన్న కోణాల్లో విచారణ జరుగుతున్నట్లు యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. విమానం యూఏఈ రిజిస్ట్రేషన్‌తో, ఆ దేశ జెండా కింద నడుస్తుండటంతో.. దేశ సరిహద్దుల వెలుపల విమానంలో నేరం జరిగినా యూఏఈ చట్టాలే వర్తిస్తాయని అధికారులు తెలిపారు.దాడి చేసిన వ్యక్తి ఒమన్‌ జాతీయుడని బుధవారం ఓ ఇజ్రాయెల్‌ అధికారి వెల్లడించారు.

పైలట్లు ఇద్దరూ ఆస్పత్రిలో

విమానంలో జరిగిన ఘటనలో కెప్టెన్‌, కో-పైలట్‌ ఇద్దరూ గాయపడ్డారు. తబుక్‌ విమానాశ్రయ అధికారులు ఇద్దరు పైలట్లను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.మరోవైపు ఘటనకు అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని ఫ్లై దుబాయ్‌ ప్రకటించింది. దర్యాప్తు పూర్తికాకముందే ఊహాగానాలు చేయొద్దని హెచ్చరించింది.

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌కు ప్రశంసలు

ప్రమాదాన్ని తప్పించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనను హీరోగా అభివర్ణించారు.దాడి చేసిన కో-పైలట్‌ కత్తితో లేదా గొడ్డలితో కెప్టెన్‌పై దాడి చేసినట్లు నెతన్యాహు తెలిపారు. తీవ్రంగా రక్తస్రావమైనప్పటికీ.. కెప్టెన్‌ కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులకు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం లభించింది.యూఏఈలోని భారత కాన్సులేట్‌ అధికారులు కెప్టెన్‌ మచ్ఛర్‌ కుటుంబాన్ని కలిసి ఆయన ఆరోగ్యం, కోలుకుంటున్న పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

‘‘విమానం ముక్కు కిందికి దూసుకెళ్లింది’’

దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ప్రయాణికుల్లో ఒకరైన యానివ్‌ హయూన్‌ ఘటనను వివరించారు. విమానం ఒక్కసారిగా కిందికి దూసుకెళ్తుండటంతో తాము కాక్‌పిట్‌ వైపు పరుగెత్తినట్లు చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని బయటకు లాగి.. అనంతరం విమాన నియంత్రణను చేపట్టినట్లు తెలిపారు.‘‘అతడిని బయటకు లాగిన తర్వాత విమానంపై నియంత్రణ తీసుకున్నాం. స్టీరింగ్‌ కంట్రోల్‌ను పైకి లాగి విమానాన్ని కొంతవరకు సమతుల్యం చేశాం’’ అని హయూన్‌ వివరించారు. ప్రయాణికులు, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 170 మందికి పైగా ప్రయాణికులతో ఉన్న విమానంలో పెను విషాదం తప్పింది. అయితే ఈ ఘటన వెనుక అసలు ఉద్దేశం, దాడికి ముందస్తు ప్రణాళిక ఉందా? మరెవరైనా సహకరించారా? అన్నది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టతకు రానుంది.