Flydubai-Copilot-Hamam-Al-Hammami : ఇతడు.. అతడేనా,, Andhra Prabha Crime Story
Flydubai-Copilot-Hamam-Al-Hammami : ఇతడు.. అతడేనా,, Andhra Prabha Crime Story
- కో పైలెట్ పై అనుమానాలెన్నో.
- లింక్డ్ ఇన్ ఖాతాలో కీలకాదారం
- వీడియో పోస్టుల కలకలం
- ఉగ్ర లింకులపై అసుమానం
- యూఏఈ దర్యాప్తు ముమ్మరం
(దుబాయ్ , ఆంధ్రప్రభ)
టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో మరో పైలట్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పైలట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి ఘటనకు ముందే అతడి ప్రవర్తన, భావజాలంపై అనుమానాలు వ్యక్తమయ్యాయని సమాచారం. ఒమన్ జాతీయ విమానయాన సంస్థ ఒమన్ ఎయిర్‌లో పనిచేసిన సమయంలో అతడిని ఫ్లైట్ ట్రైనింగ్ నుంచి తప్పించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు.
ఆ పైలట్‌ను హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. అతడు ఒమన్ పౌరుడని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించాడని సమాచారం. తన జీవితంలో కొంతకాలం యూఏఈలోనే గడిపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒమన్ ఎయిర్‌లోనే అనుమానాలు?
అల్-హమ్మామీ గతంలో ఒమన్ ఎయిర్‌లో సుమారు ఏడేళ్లు పనిచేసినట్లు అతడి పేరుతో లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. 2025 ఫిబ్రవరిలో అక్కడి ఉద్యోగాన్ని విడిచిన అతడు.. అదే ఏడాది జూన్‌లో రాయల్ ఎయిర్ మారోక్‌లో చేరినట్లు ప్రొఫైల్‌లో ఉంది. 2026 జనవరిలో ఆ సంస్థను కూడా వీడినట్లు సమాచారం.
ఈ ప్రొఫైల్ ఫ్లైదుబాయ్ విమానంలో ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పైలట్‌దేనని ఓ వర్గం ధ్రువీకరించింది.
శిక్షణకు దూరం కారణం అదే
అల్-హమ్మామీని తీవ్రవాద భావజాలం ఆందోళనల కారణంగా ఫ్లైట్ ట్రైనింగ్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.అతడిని పూర్తిగా సంస్థ నుంచి తొలగించకుండా మరో విధుల్లో కొనసాగించినట్లు తెలుస్తొంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా నిందితుడు ‘ఇస్లామిస్ట్ రాడికల్ ఇండాక్ట్రినేషన్’కు లోనై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
ఎనిమిది నెలల కిందటే
అల్-హమ్మామీ ఫ్లైదుబాయ్‌లో చేరి కేవలం ఎనిమిది నెలలే అయిందని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు.అంతకుముందు అతడు రాయల్ ఎయిర్ మారోక్‌లో కూడా పనిచేసినట్లు మరో వర్గం తెలిపింది.ఈ పరిణామాలు విమానయాన సంస్థల్లో ఉద్యోగుల నేపథ్య పరిశీలన, భద్రతా తనిఖీలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
లింక్డ్‌ఇన్ ఖాతా ఆధారం
అల్-హమ్మామీ పేరుతో ఉన్న లింక్డ్‌ఇన్ ఖాతాలో కేవలం రెండు పోస్టులు మాత్రమే కనిపించినట్టు సమాచారం. అవి ఘటన జరిగిన బుధవారం.. దాడి జరిగిన దాదాపు తొమ్మిది గంటల తర్వాత వరుసగా కనిపించాయి.వాటిని ఎవరు పోస్ట్ చేశారన్నది స్పష్టంగా లేదు. ముందుగానే షెడ్యూల్ చేసి ఉండొచ్చా? అన్న ప్రశ్నపైనా స్పష్టత లేదు. మొదటి పోస్టులో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన కాక్‌పిట్ నుంచి తీసినట్లుగా కనిపించే పలు వీడియో క్లిప్‌లు ఉన్నాయి. ఒక వీడియోను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిత్రీకరించినట్లు గుర్తించారు. అందులో ఇజ్రాయెల్ విమానయాన సంస్థ ఎల్ అల్‌కు చెందిన విమానాన్ని చూపించారు.
2023 నాటి ఫ్లైట్ వివరాలు ఎందుకు?
ఆ వీడియోలో కనిపించిన కాక్‌పిట్ స్క్రీన్‌పై OMA624 అనే విమాన సంఖ్య, 2023 అక్టోబర్ 11 తేదీ కనిపించింది. ఈ విమాన సంఖ్య సాధారణంగా దుబాయ్ నుంచి మస్కట్‌కు వెళ్లే విమానానికి సంబంధించినదిగా గుర్తించారు. ఆ తేదీ అతడు ఒమన్ ఎయిర్‌లో పనిచేసిన కాలానికి సరిపోతున్నట్లు సమాచారం.అదే వీడియోలో ఎల్ అల్‌కు చెందిన మరికొన్ని విమానాలతో పాటు మరో ఇజ్రాయెల్ విమానయాన సంస్థ ఆర్కియా విమానాన్ని కూడా చూపించారు.వీడియో చివర్లో అల్‌ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఆ సంస్థకు నాయకత్వం వహించిన అయ్‌మన్ అల్-జవాహిరి చిత్రంతో పాటు.. 2009లో ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మందిని హతమార్చిన హుమామ్ ఖలీల్ అబు-ములాల్ అల్-బలావీ చిత్రాలు కనిపించినట్లు ఓ మీడియా పేర్కొంది.
మూడు పవిత్ర స్థలాలు
రెండో పోస్టులో ఇస్లాం మతంలోని మూడు పవిత్ర ప్రదేశాలైన మక్కా, మదీనా, జెరూసలెంను ఒకదానితో మరొకటి అనుసంధానించినట్లు కనిపించే ఏఐ రూపొందించిన చిత్రం ఉంది. దాని నేపథ్యంలో వినిపించే కవితలో అవమానాన్ని తిరస్కరించడం, మరణానికి భయపడకపోవడం, గౌరవాన్ని కాపాడుకోవడం వంటి భావాలు ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులను నిందితుడే చేశాడా? వాటి వెనుక ఉద్దేశం ఏమిటి? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఉద్యోగంపై ప్రశ్నలు
ఈ ఘటనపై ఇప్పుడు మరో కీలక ప్రశ్న ముందుకొచ్చింది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించని ఒమన్ దేశానికి చెందిన వ్యక్తి.. టెల్‌అవీవ్‌కు వెళ్లే విమానంలో పైలట్‌గా ఎలా నియమితుడయ్యాడు?ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థలు అత్యంత కఠినంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఈ నియామకం ఎలా జరిగింది? అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది.ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన ప్రకారం.. షిన్ బెట్, మొసాద్, సైన్యం, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన విభాగాలు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాయి.
‘ఉగ్ర చర్యతో సంబంధముందా?’
విమానం సౌదీ అరేబియాకు మళ్లించిన నేపథ్యంలో అక్కడ కూడా దర్యాప్తు కొనసాగింది. యూఏఈ అటార్నీ జనరల్ ఈ ఘటనకు ‘ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళిక లేదా ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా?’ అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం వెల్లడించింది. విమానం యూఏఈలో రిజిస్టర్ అయి ఉండటంతో.. దేశ సరిహద్దుల వెలుపల విమానంలో జరిగిన నేరాలపైనా యూఏఈ చట్టాలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
విచారణలో ఇజ్రాయెల్
విమానం సౌదీ అరేబియాకు మళ్లిన తర్వాత నిందితుడిని అక్కడ విచారించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌తో తాను మాట్లాడినట్లు, నిందితుడి విచారణలో ఇజ్రాయెల్ అధికారులు కూడా పాల్గొనేందుకు ఆయన అంగీకరించినట్లు నెతన్యాహు వెల్లడించారు.ఇక ఇప్పుడు దర్యాప్తు అధికారులు ప్రధానంగా మూడు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.గతంలోనే భద్రతా అనుమానాల పరిధిలోకి వచ్చాడా?అతడి సోషల్ మీడియా కార్యకలాపాలు, విమానయాన ఉద్యోగాల మధ్య ఏదైనా సంబంధం ఉందా? టెల్‌అవీవ్ వెళ్లే విమానంలో దాడి వెనుక ముందస్తు ప్రణాళిక లేదా ఉగ్ర సంబంధాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఖచ్చితమైన సమాధానం లభించదు. అయితే పైలట్ గత ఉద్యోగ చరిత్ర, సోషల్ మీడియా పోస్టులు, విమాన భద్రతా వ్యవస్థల్లో జరిగిన నేపథ్య తనిఖీలు ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి.
