- ప్రకాశం బ్యారేజీకి వరద పోటు
- వాగులు వంకలు పరవళ్లు
- నిండుకుండల్లా చెరువులు
- జిల్లా యంత్రాంగం అప్రమత్తం
- ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
- లోతట్టు ప్రాంతాలలో రెడ్ అలర్ట్…
- రహదారులన్నీ జలమయం
- స్థంభించిన జనజీవనం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ ఒరిస్సా తో పాటు పలు ప్రాంతాలకలె కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో గడచిన 48 గంటలుగా ఉమ్మడి కృష్ణాజిల్లా (Krishna District) వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలి ప్రభావంతో జిల్లా అంతా వణుకుతోంది. జిల్లాతో పాటు కృష్ణానది ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్ ( Prakasam Barrage) కి పోటెత్తుతోంది. నిన్న మొన్నటి వరకు లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు విడుదల చేయగా, గురువారం ఉదయం నుండి ఈ ప్రవాహం క్రమక్రమంగా పెరిగి ప్రకాశం బ్యారేజికి ఇన్ ఫ్లో సుమారు నాలుగు లక్షల క్యూసెక్కులు చేరడంతో బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా పైకి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి 12 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమయింది.
ఇప్పటికే కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ (Collector) లక్ష్మీశ లోతు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల పరిధిలోని సచివాలయాలలో సిబ్బంది అంతా ఆయా ప్రాంతాలలో పర్యటించి నదీ పరిహక ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోని సిబ్బందితో సమీక్ష చేస్తున్న ఉన్నతాధికారులు నీటి ప్రవాహం మరింత పెరిగి లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాలు ముంపు బారిన పడితే వెంటనే అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాల (Rehabilitation centers) కు తరలించే విధంగా ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో కుంభవృష్టి ..
తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణా (Krishna District) జిల్లా వ్యాప్తంగా గడిచిన 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ సంపూర్ణ నీటి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. మరి ముఖ్యంగా జిల్లాలోని కట్టలేరు వంతెన పై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండడంతో దాన్ని మళ్లించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలోని నందిగామ జగ్గయ్యపేట తిరువూరు నియోజకవర్గాలలో అత్యధిక శాతం వర్షపాతం నమోదవుతుంది.
అలాగే మైలవరం నియోజకవర్గం (Mylavaram Constituency) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడ నగరంలో గరిష్ట వర్షపాతం నమోదైన నేపథ్యంలో రహదారులన్నీ కాలువలను తలపిస్తూ మోకాలు లోతులో వరద నీరుతో పాటు మురుగునీరు రహదారులపై ప్రవహిస్తోంది. బెంజ్ సర్కిల్ తో పాటు నిర్మలా కాన్వెంట్ ఏలూరు రోడ్డు, వన్ టౌన్ తో పాటు పలు ప్రాంతాలలో కాలువలో డ్రైనేజీలో పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రభావంతో నగరవ్యాప్తంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.