ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతలా కాంగ్రెస్ పాలన ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఈ రోజు తెలంగాణ భవన్‍లో వడ్డెర సంఘం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్నదేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కుమార్తె, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశామని, కేబినెట్ మీటింగ్‍లో ముఖ్యమంత్రి, మంత్రులు తిట్టుకున్నారట అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించడం లేదని, వాళ్లు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతోందని విమర్శించారు. మళ్లీ కేసీఆర్(KCR) వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ హైదరాబాద్‍లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తే, రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టారని విమర్శించారు. పేదల ఇండ్లు కూల్చొద్దన్న, హైడ్రా బంద్(Hydra Bund) కావాలన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) కాంగ్రెస్‍ను ఓడించాలన్నారు.
ఇక్కడ కాగ్రెస్ గెలిస్తే హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చినా ప్రజలు నాకే ఓట్లేశారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విర్రవీగుతారని, అందువల్ల కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలంటే ఈ ఉప ఎన్నికలో ఓటుతో రేవంత్ రెడ్డి కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి డబ్బు మూటలను, గుండాలను నమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో మీరు అడగకపోయినా హైదరాబాద్‍లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎకర భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ఒక రూపాయి అయినా బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ఇచ్చావా? అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రారంభించిన బీసీ ఆత్మగౌరవ భవనాలకు నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలన్నారు. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయి చిన్నపిల్లలు ఉన్నారని, గోపీనాథ్ చనిపోతే ఆ కుటుంబాన్ని అనాధలుగా వదిలేయమంటారా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో సునీతమ్మ విజయానికి సహకరించాలని కోరారు.

