ఏయే జిల్లాల్లోనంటే…!!

మొంథా తుపాను ప్రభావం తెలంగాణ అంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి.

అయితే, మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తమైంది. రాబోయే మూడు రోజులకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈరోజు (మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇక రేపు (బుధవారం) ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ములుగు, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయబడింది. అలాగే నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

గురువారం ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ వాతావరణం….

హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాలు నీటమునిగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇక అటు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాల వైపు మొంథా తుపాన్ కోర్ బ్యాండ్లు చేరుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలు రాబోయే 24 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Leave a Reply