అడ్రియాల ప్రాజెక్టులో ప్రమాదం
ఐదుగురు కార్మికులకు గాయాలు
వీరిలో కొందరికి వినిపిడి శక్తి లోపం!
గోదావరిఖని (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణి సంస్థ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు లో ఎఫ్.బీ.ఎల్ ఎయిర్ ట్యాంక్ బ్లాస్ట్ కావడంతో అక్కడే ఉన్న ఐదుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గురువారం రోజున గోదావరిఖనిలోని ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు చికిత్స కొనసాగుతోంది.
ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్, ఫిట్టర్ కిరణ్, లక్ష్మణ్, హెల్పర్లు ప్రశాంత్, మనోజ్ గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ప్రాజెక్టు అధికారులు వారిని హుటాహుటిన సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన కార్మికులు కార్మికుల ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు అంటున్నారు. వీధిలో ఉండగా గాయపడ్డ వారిలో కొందరికి వినికిడి లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒకసారి గా భారీ శబ్దంతో ట్యాంకర్ బ్లాస్ట్ కావడం మూలంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
రక్షణ వైఫల్యం : బి ఎం ఎస్ నేత
సింగరేణి యాజమాన్యం రక్షణ వైఫల్యంతోనే ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగిందని బిఎంఎస్ కార్మిక నాయకుడు యాదగిరి సత్తయ్య ఆరోపణలు వ్యక్తం చేశారు. కార్మికుల భద్రత నిర్లక్ష్యం చేయడంపై సత్తయ్య మండిపడ్డారు. రక్షణ సూత్రాలు సక్రమంగా పాటించడం లేదన్నారు.
