ఫైవ్‌స్టార్ ఫైనాన్స్ వేధింపుల ఆరోపణలు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల గ్రామానికి చెందిన చాట్లా మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఫైవ్‌స్టార్ ఫైనాన్స్ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహేష్‌కు భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
రుణ బకాయిల విషయంలో ఫైవ్‌స్టార్ ఫైనాన్స్ ఉయ్యూరు మేనేజర్ మోహన్‌కృష్ణ తమ ఇంటికి వచ్చి తనను, తన భర్తను తీవ్ర పదజాలంతో దూషించారని మృతుడి భార్య ఆరోపించారు. ఈ అవమానాన్ని భరించలేక తన భర్త వారి సమక్షంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపిస్తున్న మేనేజర్ మోహన్‌కృష్ణపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, కుటుంబ సభ్యుల ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.
