- రూ.75,000 లంచం తీసుకుంటూ
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో రూ.75,000 లంచం తీసుకుంటూ ఫీల్డ్ ఆఫీసర్ హరీష్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లా మత్స్య శాఖాధికారి డిమాండ్ మేరకు ఫీల్డ్ ఆఫీసర్ ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. జిల్లా మత్స్య శాఖాధికారి ప్రమేయంపై ఎసిబి అధికారులు విచారణ ప్రారంభించారు.
అధికారులు న్యాయబద్ధంగా చేయాల్సిన పనిని అనవసర తాత్సారం చేస్తూ మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2023లో చేసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కొర్రీలు పెడుతూ మత్స్యకారులను తిప్పుకుంటున్నారు. విసిగిపోయిన బాధితులు వరంగల్ ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
మత్స్య శాఖాధికారి కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల వివరాలను అవినీతి నిరోధక శాఖ వరంగల్ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు..
వరంగల్ జిల్లా మాదన్నపేట మత్స్య సహకార సంఘంలో 2023లో 124 మంది మత్స్యకార సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ సభ్యత్వ నమోదును ఖరారు చేయాలని సొసైటీ అధ్యక్షులు మత్స్య శాఖాధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, సంబంధిత పనిని చేయకుండా అనవసర జాప్యం చేస్తున్నారు.
సొసైటీ అధ్యక్షులు నేరుగా జిల్లా మత్స్య శాఖాధికారిణి నాగమణిని కలిసినప్పుడు, ఆమె రూ.1,50,000 డిమాండ్ చేశారు. పలు దఫాలుగా చర్చలు జరిపి చివరకు ₹80,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు.
మత్స్యకారుల హక్కుకు సంబంధించిన సభ్యత్వ నమోదును ఖరారు చేసేందుకు సంబంధిత శాఖాధికారులు లంచం డిమాండ్ చేయడం నచ్చని సొసైటీ అధ్యక్షులు నరసయ్య నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ఆదేశాల మేరకు శుక్రవారం వరంగల్ జిల్లా మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో రూ.75,000 లంచం తీసుకుంటున్న ఫీల్డ్ ఆఫీసర్ హరీష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నూతన సభ్యత్వాల కేటాయింపు జిల్లాల పరిధిలోనే చేయాలని 2025 ఆగస్టులో ప్రభుత్వం నుండి సర్క్యులర్ విడుదలైంది. ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ నరసయ్య అధికారులను నిలదీశారు. నూతన సభ్యత్వాల కోసం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రూ.80,000 ఇస్తే తప్ప పని కాదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ విషయం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ నాగమణికి ఫిర్యాదు చేయగా, ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన డబ్బులు ఇస్తేనే నూతన సభ్యత్వాలు ఇస్తానని సదరు అధికారిణి సైతం తెగేసి చెప్పారు.
దీంతో సొసైటీ చైర్మన్ నరసయ్య అవినీతి అధికారుల బాగోతాన్ని కట్టడి చేసేందుకు వారిని నమ్మిస్తూనే, వరంగల్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రూ.75,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

