భారత్ వేదికగా తొలి ఛాంపియన్స్‌ ట్రోఫీ…

  • ఛాంపియన్స్‌ ట్రోఫీకి రంగం సిద్ధం

ఆంధ్రప్రభ : మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. తొలిసారి నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి తేదీలు, వేదికలను ఖరారు చేశారు. వ‌చ్చే ఏడాది (2027) ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు భారత్‌ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. ఆరు జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో అన్ని మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహించనున్నారు. ముంబైలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ), వడోదరలోని వడోదర అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

మొదట ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే శ్రీలంక క్రికెట్‌ సంస్థలో సంస్కరణలు కొనసాగుతున్న నేపథ్యంలో వేదికను భారత్‌కు మార్చారు. ఆతిథ్య దేశ ఎంపికలో భారత్‌, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలను పరిశీలించిన ఐసీసీ.. చివరకు భారత్‌ను ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 1న ఐసీసీ బోర్డు ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

తొలి మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు బరిలోకి దిగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆరు జట్లు లీగ్‌ దశలో తలపడతాయి. లీగ్‌ అనంతరం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌లో పోటీ పడతాయి.

మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకురావడంలో ఈ టోర్నీ కీలకంగా మారుతుందని ఐసీసీ చైర్మన్‌ జై షా పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ఒకే వేదికపై పోటీ పడటం ద్వారా మహిళల క్రికెట్‌ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాను ఓడించి భారత్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఇప్పుడు తొలి మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఏ జట్టు చరిత్ర సృష్టిస్తుందన్న ఆసక్తి నెలకొంది.