సింగ్‌నగర్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో అగ్నిమాపక మాక్ డ్రిల్
ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన అవసరం: ఆర్‌ఎఫ్‌ఓ రత్నబాబు
పాయకాపురం, ఆంధ్రప్రభ : పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ మార్గాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి రత్నబాబు సూచించారు. మంగళవారం విజయవాడ సింగ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం, అగ్నిమాపక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌ఓ రత్నబాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు 101 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక పరికరాల వినియోగాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సిలిండర్‌లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పే పద్ధతులు, అగ్నిమాపక పరికరాన్ని వినియోగించే విధానాన్ని అధికారులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాల భవనంలోని అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఇతర భద్రతా ప్రమాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాల్లో తగినన్ని అగ్నిమాపక పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆశా జార్జ్, పీఈటీ జోసెఫ్, ఉపాధ్యాయులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
