ఇండిగో విమానంలో మంట‌లు…

  • శంషాబాద్ ఏయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ !
  • ఢిల్లీ–చెన్నై విమానం దారి మళ్లింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గాల్లో ప్రయాణిస్తుండగానే.. విమానంలో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ6115లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్‌ బ్యాంక్‌ నుంచి మంటలు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

విమానం పైభాగంలో సామాన్లు ఉంచే లగేజీ కంపార్ట్‌మెంట్‌లో మంటలు కనిపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు కొందరు ప్రయాణికులు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పవర్‌ బ్యాంక్‌ నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, ఘటనకు కచ్చితమైన కారణం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.