ఖాళీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

పాయకాపురం, ఆంధ్రప్రభ: అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలోని ఖాళీగా ఉన్న జి+3 అపార్ట్‌మెంట్‌లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అపార్ట్‌మెంట్‌లో ఎవరూ నివసించకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన జి+3 అపార్ట్‌మెంట్లలో 14వ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఓ ప్లాట్‌లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆ ప్లాట్‌లో ఎవరూ నివసించడం లేదు. ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్లను కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అపార్ట్‌మెంట్‌లోని పలు ప్లాట్లు వ్యర్థాలతో నిండిపోయి అధ్వానంగా ఉన్నాయని వారు తెలిపారు. కిటికీ అద్దాలు, తలుపులు పగులగొట్టడంతోపాటు ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా కొందరు ఆకతాయిలు అక్కడికి వస్తున్నారని చెప్పారు. అపార్ట్‌మెంట్‌లో పేకాట కూడా ఆడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎవరైనా సిగరెట్‌ వెలిగించి వ్యర్థాలపై పడేయడంతో మంటలు వ్యాపించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్‌ నుంచి ఒక్కసారిగా మంటలు, పొగలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 59వ డివిజన్‌ అధ్యక్షుడు రాజన్న బంగారు నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు.

ఇటీవల కండ్రిక బీవీ సుబ్బారెడ్డి హైస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం, తాజాగా సింగ్‌నగర్‌ ప్రాంతంలో మరో అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు వ్యర్థాలను తొలగించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.