AP | ఛార్జింగ్‌లో ఉండగానే..

AP | ఛార్జింగ్‌లో ఉండగానే..

ఫోన్‌ పేలడంతో చెలరేగిన మంటలు..
దగ్ధమైన ఇంట్లోని వస్తువులు
గోడలకు బీటలు..
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం


AP | గుడ్లూరు, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లాలో సెల్‌ఫోన్‌ పేలుడు కలకలం రేపింది. ఛార్జింగ్‌ పెట్టిన మొబైల్‌ ఫోన్‌ ఒక్కసారిగా పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గుడ్లూరు మండలం పాజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. మంటల ధాటికి ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. గోడలకు సైతం బీటలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

పనికి వెళ్లిన సమయంలో ప్రమాదం..
స్థానికుల వివరాల ప్రకారం.. పాజర్ల గ్రామానికి చెందిన తిరుమల అనే వ్యక్తి తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టి పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేలోపు ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.

దగ్ధమైన ఇంట్లోని వస్తువులు..
సెల్‌ఫోన్‌ పేలుడుతో చెలరేగిన మంటల కారణంగా ఇంట్లోని పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. గోడలకు బీటలు రావడంతో ఇంటికి నష్టం వాటిల్లింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఛార్జింగ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.