రెండంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు

  • మొదటి అంతస్తులో కిడ్స్‌ స్కూల్‌..
  • రెండో అంతస్తులో నివాసాలు

సంతోష్‌నగర్‌, ఆంధ్రప్రభ : ఐఎస్‌ సదన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

భవనం మొదటి అంతస్తులో కిడ్స్‌ స్కూల్‌ ఉండగా.. రెండో అంతస్తులో ఇళ్లు ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై భవనాన్ని ఖాళీ చేయించారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఘటన సమాచారం అందుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.