ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఇటీవల విశాఖలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ప్లాంట్ లో ఉన్న బొగ్గు నిల్వల (Coal reserves)కు మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్నవారు అంతా భయాందోళనకు గురయ్యారు. ఆర్‌ఎమ్‌హెచ్‌పీ (Raw Material Handling Plant) విభాగంలో నిల్వ ఉంచిన కోకింగ్ కోల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికుల ఈ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది (Firefighters) అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు సిబ్బంది మంటల వ్యాప్తిని అడ్డుకోవడానికి కృషి చేస్తుండగా, పొగ దట్టంగా వ్యాపించడంతో ఆ ప్రాంతం పూర్తిగా ఆందోళన వాతావరణం లోకి వెళ్లిపోయింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోకింగ్ కోల్‌లో అధిక ఉష్ణోగ్రతలు, ఆవిరి వల్ల స్పాంటేనియస్ కంబషన్ (స్వతహాగా మంటలు చెలరేగడం) జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మంటలు మరింతగా వ్యాపించకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.