పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ విభాగంలో అత్యంత వేడి పుట్టించే క్లైమాక్స్ ఘట్టం ఆరంభమైంది. పసిడి పతకమే లక్ష్యంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. ఈ మైండ్ గేమ్‌తో కూడిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ దిగనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ ధీమా
గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన టీమ్ఇండియా, ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ప్రత్యక్షంగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్ పోరులో శ్రీలంకను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చిత్తుగా ఓడించిన భారత జట్టు, అదే విజయాల ఊపుతో ఫైనల్ చేరింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మొదట భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ
మరోవైపు ప్రత్యర్థి పాకిస్థాన్ కావడం, అది కూడా పసిడి పతకం కోసం జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. సెమీస్‌లో లోపాలను సరిదిద్దుకుని భారత బ్యాటర్లు బోర్డుపై పెద్ద స్కోరు ఉంచితే పాక్‌ను కట్టడి చేయడం సులువవుతుంది. పసిడి పతకాన్ని ముద్దాడి ఆసియా క్రీడల్లో మరోసారి భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుతుందో లేదో చూడాలి!
భారత్ తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా
పాకిస్థాన్ తుది జట్టు:
షాహిబ్జాదా ఫర్హాన్(కెప్టెన్), సదాఖత్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), సైమ్ ఆయుబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమాద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మొకిమ్
