19 మందికి అంతిమ వీడ్కోలు

19 మందికి అంతిమ వీడ్కోలు

  • ఇదీ కావేరీ బస్సు ఘోరం

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో మృతుల డీఎన్ఏ రిపోర్టులు(DNA reports) వచ్చాయి. మృతదేహాల గుర్తింపు నిర్ధారణ అనంతరం, వాటిని బాధిత కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ ఆదివారం కర్నూలులోనీ జిజిహెచ్ హాస్పిటల్లో జరగగా…అక్కడి దృశ్యం .. వర్ణనాతీతం. బంధువుల కన్నీళ్ల పర్యంతంతో.. వేదనతో, విషాదంతో, తల్లడిల్లే క్షణాలతో నిండిపోయింది. బెజవాడ నుంచి వచ్చిన డీఎన్ఏ ఫలితాల జాబితా ఆధారంగా, 18 మృతదేహాల్లో ప్రతి ఒక్కరి గుర్తింపును అధికారులు ఖరారు చేశారు.

మృతుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, జీవిత భాగస్వాములు, బంధువులు అందరూ కర్నూలుకు చేరుకున్నారు. పోలీస్ , రెవెన్యూ అధికారులు సహకరిస్తూ మృతదేహాల(dead bodies) అప్పగింత ప్రక్రియను పూర్తి చేశారు. ఇదే నా కొడుకు ముఖం…అని ఓ తల్లి విలవిల్లాడగా,ఇక నా తమ్ముడు నవ్వు వినలేను అని ఓ సోదరుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు.ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కన్నీటి గాధగా మారిపోయింది.

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ . ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(SP Vikrant Patil) పర్యవేక్షణలో మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. ప్రతి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తగిన గౌరవంతో వారి స్వగ్రామాలకు తరలించారు. ప్రతి అంబులెన్స్ కదలికతో అక్కడి వాతావరణం తడిసి ముద్దైంది. కన్నీటి వర్షం కురిసింది. ఆకాశం కూడా మూగ సాక్షిగా నిలిచింది.

తల్లిదండ్రులు, సోదరులు, భార్యల .. కన్నీటి సంధ్రం పొంగింది. అక్కడున్న ప్రతి కుటుంబం ఒక గాథ.ఒక తల్లి తన కుమారుడి శరీరాన్ని పట్టుకుని ఇలా వెళ్లిపోతావా రా బిడ్డా..అంటూ మూర్చిపోయింది.భార్య తన భర్తను చూసి ..ఇది నిద్రా లేక శాశ్వత నిశ్శబ్దమా?” అంటూ విలవిలలాడింది. సోదరులు, అక్కాచెల్లెల్లు, పిల్లలు, అందరూ ఒక్కొక్కరూ వేదనకు ప్రతి రూపమయ్యారు. చిన్నటేకూరు(Chinnatekuru) ఘటన మళ్లీ వారి గుండెల్లో మంటలు రేపింది.మృతదేహాలను గుర్తించడం ఒకవైపు ఉపశమనం అయినా, అదే సమయంలో అది వారికీ జీవితాంతం చెరగని ముద్రగా మిగిలింది.

కర్నులు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం, ఆదరణ అందుతుందన్నారు. మృతుల గుర్తింపు తర్వాత అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రమాద దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత కుటుంబాలకు అంబులెన్స్(ambulance) సౌకర్యం కల్పించాం. ప్రతి మృతదేహాన్ని గౌరవప్రదంగా స్వగ్రామాలకు తరలిస్తున్నాం, అని ఎస్పీ తెలిపారు.

‘మాకు ప్రాణాలు కాదు, జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి..ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విద్యార్థులు, యువకులు, దంపతులు ఉన్నారు.అందుకే ప్రతి మృతదేహం ఒక కుటుంబానికి ఒక ప్రపంచాన్ని కోల్పోయినంతే. ఒక తల్లి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తూ, నిన్న ఉదయం ఫోన్‌లో మాట్లాడాను. రాత్రికి శవంగా చూస్తానని ఊహించలేదు. అని చెప్పి అదుపు తప్పింది.

ప్రయాణికుల భద్రతపై నిర్లక్ష్యం, ఫైర్ సేఫ్టీ లోపాలు, డ్రైవర్(driver) అప్రమత్తత లేకపోవడం, ఇవే ఈ ఘోర ప్రమాదానికి మూలం. ప్రతి అంబులెన్స్ బయలుదేరినప్పుడు… ప్రజల హృదయాల్లో ఒకే ప్రశ్న ప్రతిధ్వనించింది .ఇలా ప్రాణాలు పోతుంటే బాధ్యత ఎవరిది?. ఒక రోడ్డు ప్రమాదం ఎంతమందిని చీల్చేస్తుందో చిన్నటేకూరు ఘటన మరోసారి చూపించింది.

ఒక కుటుంబం కాదు… 19 కుటుంబాలు నిశ్శబ్దంగా కూలిపోయాయి. మృతదేహాలు ఇంటి బాట పట్టినా, ఆ ఇళ్లు ఇక గళం వినవు. ప్రభుత్వం, రవాణా శాఖ, ట్రావెల్స్ సంస్థలు, ప్రతి ఒక్కరూ ఈ కన్నీటి కదలికను పాఠంగా తీసుకోవాలి. జీవితం తిరిగి రాదు, కానీ ప్రాణాల భద్రత కోసం తీసుకున్న చర్యలు మరొక ప్రమాదాన్ని ఆపగలవు.

Leave a Reply