హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై ప్రతికూల పవనాలు
(వురిటి రమాకాంత్, సీనియర్ జర్నలిస్టు) : హిట్లర్.. ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేని ఓ నియంత! ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) హిట్లర్ లా వ్యవరిస్తున్నాడు! ఏ పాలకుడైనా తన దేశానికి ఎలాంటి నష్టం జరగకుండా ఇతర దేశాలపై ఆంక్షాలు విధించేలా నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ట్రంప్ రూట్ సపరేట్ గా ఉంది. తన స్వార్థం… మొండితనం కోసం సొంత దేశస్థులు ఏమైపోయినా పర్వలేదు. కానీ తాను మాత్రం ప్రపంచాన్ని శాసిస్తాను అనే దృక్పథంతో ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఇంటా, బయటా నియంతలా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు తోచితే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు శాసిస్తే ప్రపంచమంతటా తల ఊపాలి అనే ధోరణి ప్రస్తుతం లేదన్న విషయాన్నిపాలనా అనుభవం ఉన్నా ట్రంప్ గుర్తించకపోవడం గమనించదగిన విషయం.
ఆ గుర్తించకపోవడంతోనే అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని వాదన కూడా లేకపోలేదు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అంతర్గతంగా పోరుకు దారితీసింది. దిగుమతుల సుంకం పెంచుతూ అమెరికా అధ్యక్షుడు (American President) తీసుకుంటున్న నిర్ణయంతో ఆ దేశంలో ధరలు పెరిగినా, బతుకు భారమైనా వ్యతిరేకించలేదు. కానీ అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలో విద్యావంతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఫీజు పెంచడంతో భారతదేశంతోపాటు, వివిధ దేశాలకు చెందిన విద్యావంతులకు నష్టం కలుగుతుందని మొదట భావించినా, సొంత దేశ విద్యావంతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఆలోచనలో అమెరికాన్లు ఇప్పుడిప్పుడు ఉన్నారు.
సాఫ్ట్‌వేర్ (Software) అభివృద్ధి చెందిన తర్వాత ఏ దేశంలో అవకాశాలు ఎక్కువగా ఉంటే ఆ దేశంవైపు ఇతర దేశాల విద్యావంతులు పరుగులు తీస్తున్నారు. అయితే ఆయా దేశాలు కల్పించే సదుపాయాలను కూడా వినియోగించుకోవడం పరిపాటి. అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ రెండో సారి ఎన్నికైన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు సొంత దేశ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు అనేక కారణాలు లేకపోలేదు. ప్రధానంగా హెచ్-1బీ వీసా వల్ల అమెరికాకు వచ్చే మేథావులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికాలో మానవ వనరులు లేకపోతే పొరుగు దేశాల వైపు కంపెనీలు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో అమెరికాలోని విద్యావంతులు ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇదీ అమెరికా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు.
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (US Citizenship and Immigration Services) (యూఎస్‌సీఐఎస్) మూడు రోజుల కిందట ప్రకటించిన మేరకు ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తోసహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదు. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందనిగ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి, హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.
ప్రస్తుతం భారత దేశంతోపాటు మరికొన్ని దేశాల నుంచి వలస వచ్చిన వారు అమెరికాలో ఉన్న కంపెనీలకు బలం. హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును పెంచడం వల్ల అమెరికాకు నైపుణ్యం గల వలసదారులు రాక ఆగిపోతుంది. దీంతో చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే కొత్త ఆవిష్కరణలు తగ్గిపోతాయి అని అమెరికా మేథావులతోపాటు ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన ఉంది. అనేక దేశాల నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను కోల్పోవాల్సి ఉంటుంది. పెద్ద కంపెనీలు ఈ మొత్తాన్ని భరించినప్పటికీ చిన్న కంపెనీలు ఆ వీసా అభ్యర్ధుల నియామకాలను నిలిపివేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టులు కూడా అమెరికా నుంచి ఇతర దేశాలకు తరలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో ఒక ఉద్యోగికి హెచ్-1బీ వీసా కోసం రూ.87 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంతో కంపెనీలపై ఆర్థిక భారం ఎక్కువగా పడుతుంది. ఇలాంటి ఆర్థిక భారంతో కంపెనీలు తరలిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.
హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు (US Congress members) లేఖ రాశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు వాణిజ్య మంత్రి లుట్నిక్కు డెమోక్రట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన ఏడుగురు చట్టసభ సభ్యులు ఈ లేఖ రాశారు. హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును పెంచడం వల్ల ఆ వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కాకుండా మార్పులు అవసరమని తాము కూడా భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఫీజు పెంచడం అనేది సరైన చర్య కాదన్నారు. ఇది ప్రతికూలమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. ట్రంప్ నిర్ణయంపై కోర్టుల్లో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Lavin) మాట్లాడుతూ…… హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ వ్యాజ్యాలపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా చాంబర్ అఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తంచేసింది. హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తన వ్యాజ్యంలో వాదించింది. ఇక పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అధ్యక్షుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ఆయనకు లేఖ కూడా రాశారు. వీటిని పరిశీలిస్తే రానున్న రోజుల్లో హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజు పెంపుపై మరింత ఆందోళనలు జరిగినా, వ్యతిరేక పోరాటాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

