గ్యాస్ దుర్వాసనతో ప్రజల అవస్థలు..
సూరారంలో గ్యాస్ దుర్వాసన భయం..
ఊపిరాడక ఊపిరిపీల్చుకోలేకపోతున్న జనం..
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం!
ఎల్కతుర్తి (హనుమకొండ) ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని సూరారాం గ్రామాన్ని విపరీతమైన గ్యాస్ దుర్వాసన ముంచెత్తుతోంది. గ్రామానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ ప్రాంతం నుంచి నిరంతరాయంగా ఎగసిపడుతున్న ఘాటైన వాసనతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిశ్రమల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సూరారం వాసులు ఆరోపిస్తున్నారు.
రోగాల బారిన పడుతున్న వృద్ధులు, చిన్నారులు
గత కొద్దిరోజులుగా వస్తున్న ఈ రసాయనిక దుర్వాసన కారణంగా ఇంట్లో ఉండలేని శోచనీయ పరిస్థితి దాపురించింది. ఈ ఘాటైన వాసనను పీల్చడం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో అల్లాడిపోతున్నారు. గ్రామంలో చాలామంది దగ్గు, తుమ్ములు, తీవ్రమైన ఆయాసం మరియు కళ్ల మంటలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ దుర్వాసన తీవ్రత మరీ ఎక్కువవుతుండటంతో కంటిమీద కునుకు లేకుండా భయంతో కాలం వెళ్లదీస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
అధికారులు తక్షణమే స్పందించాలి
ప్రజల ఆరోగ్యం క్షీణించి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదముందని, సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి (PCB), రెవెన్యూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ లేదా దుర్వాసనకు గల మూల కారణాలను తక్షణమే అన్వేషించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు లేదా సదరు ప్లాంట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూరారాం గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
