Flood Scare | మన్యంలో మళ్ళీ వరద భయం…
- ఏజెన్సీలో మళ్ళీ పెరుగుతున్న శబరి, గోదావరి
- రహదారిపై చేరిన సోకిలేరు
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్ ఆదేశాలు జారీ
Flood Scare | చింతూరు, ఆంధ్రప్రభ : పోలవరం (రంపచోడవరం) జిల్లాలోని చింతూరు మన్యంలో మళ్ళీ వరద భయం మొదలైంది. ఈ ఏడాది వరదలు ఉండవు అనుకున్న క్రమంలో జులై 30 న మెల్లగా వరద మొదలయింది. మన్యంలో వారం రోజుల పాటు వరదలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసి ఎట్టకేలకు ఈ నెల 3 వ తేదీన తగ్గడం ప్రారంభించి 5వ తేది నాటికి పూర్తిగా వరద ఏజెన్సీనీ వీడింది. ఇది ఇలా ఉంటే మళ్ళీ గత మూడు రోజులుగా ముసురు పట్టి చింతూరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు ఒడిస్సా అటు ఛత్తిస్గడ్ మరో పక్క తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో మెల్లగా శబరి, సీలేరు, గోదావరి నదుల్లో వరద నీరు చేరుకొని మెల్లగా వరద పెరుగుతుంది.
రహదారిపై చేరిన సోకిలేరు…
మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మన్యంలో కురుస్తున్న వర్షాలకి ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఆ వరద నీరు శబరి నది చేరుకుంటూ శబరి నది వరద పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శబరి నదికి అనుసంధానం అయిన వాగులు, వంకలు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే చింతూరు – వీఆర్ పురం మండలాల నడుమ ఉన్న సోకిలేరు వాగు పొంగి ఆ వరద నీరు రహదారిపై చేరింది. దీంతో మండలంలోని 11 గిరిజన గ్రామాలతో పాటు వీఆర్ పురం మండలానికి రాకపోకలకి అంతరాయం వాటిల్లింది. చింతూరు శబరి నది మంగళవారం మధ్యాహ్న సమయానికి 29 అడుగుల కనిష్ఠ నీటి మట్టానికి చేరుకొని నెమ్మదిగా పెరుగుతుంది. మన రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది కొంచెం కొంచెం పెరుగుతూ మధ్యాహ్నం సమయానికి 21 అడుగుల వరద నీటి మట్టంకి చేరుకొని నెమ్మదిగా పెరుగుతుంది.

భయం భయం…
మన్యంలో ఒకసారి శబరి నది పొంగి ప్రవహించడంతో పాటు మళ్ళీ వరద పెరుగుతుండటంతో మన్యంలో పల్లెల వాసులకు మళ్ళీ వరద భయం పట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ వరద ఇలానే ఉండగా చింతూరు శబరికి ఎగువ ప్రాంతమైన డొంకరాయి జలాశయంలో వరద నీటి పెరుగుతుంది. ఈ డ్యామ్ అసలు సామర్ధ్యం 1037 అడుగులు కాగా ప్రస్తుతం 1013 అడుగుల నీటి మట్టానికి చేరుకొంది. అదేవిదంగా ఛత్తిస్గడ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఆ వరద శబరి నదిలో కలుస్తుంది.

అప్రమత్తంగా ఉండాలి…
గోదావరి, శబరి నది వరదలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని, వరద ప్రభావిత మండలాల అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలవరం (రంపచోడవరం ) జిల్లా కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30 వ తేది వరకు వరదలు వచ్చే అవకాశం ఉన్ననందున అధికారులతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను ప్రజలకిస్తున్నారు. రహదారులపై వరద చేరిన ప్రదేశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలేవ్వరూ వాగులు, వంకలు దాతకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
