నాడు తండ్రి.. నేడు కూతురు..

గోపీచంద్ కుటుంబానికి అరుదైన గౌరవం

విజయవాడ, ఆంధ్రప్రభ: అర్జున అవార్డుకు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి పుల్లెలకు శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు తెలిపారు. గాయత్రి సాధించిన ఈ ఘనత కఠోర శ్రమ, పట్టుదల, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. తండ్రి పుల్లెల గోపీచంద్ బాటలో పయనిస్తూ గాయత్రి బ్యాడ్మింటన్‌లో రాణించి అర్జున అవార్డు సాధించడం గర్వకారణమన్నారు. నాడు తండ్రి.. నేడు కూతురు అంటూ గోపీచంద్ కుటుంబం రెండు తరాలుగా భారత క్రీడా రంగానికి సేవలందిస్తూ అరుదైన గౌరవాన్ని తీసుకురావడం స్ఫూర్తిదాయకమని రవి నాయుడు అన్నారు. గాయత్రి విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆకాంక్షించారు.