Singarayakonda | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
Singarayakonda | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు
Singarayakonda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా సింగరాయకొండ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదంలో కారులో వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, లారీ రహదారిపై ఏ పరిస్థితుల్లో నిలిపి ఉంచారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
