పశ్చిమ బెంగాల్ : పశ్చిమబెంగాల్ (West Bengal)లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బొలేరో వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పురులియా (Purulia) జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారి 18పై ఈ ఘటన చోటు చేసుకుంది. పురులియాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోగల అడబానా గ్రామానికి చెందిన పలువురు జార్ఖండ్‌లోని నిమ్దిహ్ ప్రాంతంలో తిలైతాండ్‌లో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి బొలెరో వాహనంలో వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలేరో వాహనంలోని తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. వారంతా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

