ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లా కైపమంగళం సమీపంలోని పనమ్బిక్కున్ను ప్రాంతంలో హైవేపై నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వారంతా తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా పోలీసులు భావిస్తున్నారు. గురువాయూర్ నుంచి కొడంగలూరు వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి హైవేపై నిలిపి ఉంచిన లారీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతినడంతో అందులో ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
