బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఢీకొట్టిన యువతీ, యువకుడు
ఆంధ్రప్రభ, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర ఆలయం సమీపంలోని ఆశా ఆసుపత్రి వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ యువతీ, యువకుడు వోక్స్‌వ్యాగన్ కారును అతివేగంగా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారు నడిపిన యువతీ, యువకులపై తీసుకున్న చర్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
