డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో పంటలను నమోదు చేసుకోవాలి

రైతులు పొలాల వద్ద అందుబాటులో ఉండాలి..
తప్పులుంటే 72 గంటల్లో సరిచేసుకునే అవకాశం

తాడ్వాయి, ఆంధ్రప్రభ : డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో భాగంగా రైతులు తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకునే సమయంలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మండల వ్యవసాయ అధికారి నర్సింహులు సూచించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ఈ-క్రాప్‌ సర్వే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సమక్షంలోనే పంట వివరాలను నమోదు చేస్తామని తెలిపారు.

పంట వివరాల నమోదు అనంతరం సంబంధిత సమాచారం మెసేజ్‌ రూపంలో రైతుల మొబైల్‌ ఫోన్లకు పంపిస్తామని చెప్పారు. రైతులు తమకు వచ్చిన మెసేజ్‌లోని పంట వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. వివరాల్లో ఏదైనా తప్పుగా నమోదైతే 72 గంటల్లోపు సరిచేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులందరూ డిజిటల్‌ క్రాప్‌ సర్వే సమయంలో తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి, పంటల నమోదు ప్రక్రియలో అధికారులు, సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి దేవేందర్‌, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.