Farmers Protest for 3-Phase Power Supply – Adb | త్రీ ఫేజ్ కరెంటు కోసం రైతుల ఆక్రోశం..!
పురుగుల మందు డబ్బాలతో సబ్‌స్టేషన్ ముట్టడి
- అరకొర విద్యుత్ సరఫరాతో ఎండిపోతున్న పంటలు
- పత్తి, సోయాబీన్, కంది పంటలకు తప్పని కష్టాలు
- పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన
– సమస్య పరిష్కరిస్తామని అధికారుల హామీ
Farmers Protest for 3-Phase Power Supply – Adb |ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల రైతులు ఆందోళనకు దిగారు. అడ్డగోలుగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి, సోయాబీన్, కంది తదితర వానాకాలం పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు.
గత నాలుగు రోజుల్లో తలమడుగు, భీంపూర్ మండలాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనల నేపథ్యంలో వందలాది మంది రైతులు పురుగుల మందు డబ్బాలను చేతబట్టి ఆర్లిటి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కనీసం విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. వందలాది మంది రైతులు ఒక్కసారిగా సబ్‌స్టేషన్‌కు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మా గ్రామాల్లో 24 గంటలూ కరెంటు లేదు..!
భీంపూర్ మండలంలోని గోమూత్రి, అంతర్గాం, కరెంజి తదితర గ్రామాల రైతులు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలు ఉండటంతో పంటలు ఎండుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో వ్యవసాయ బోర్ల ద్వారా పంటలకు నీరు అందించలేకపోతున్నామని తెలిపారు.
సాగు కోసం ఇప్పటికే వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, సమయానికి నీరు అందక పంటలు ఎండిపోతే దిగుబడి లేక అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపణ
విద్యుత్ సరఫరా సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని రైతులు ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన రైతులు పురుగుల మందు డబ్బాలతో సబ్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
హామీతో ఆందోళన విరమణ
రైతుల నిరసన విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. విద్యుత్ సరఫరా సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
