రైతులకు మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు
సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు తమ ధాన్యానికి మద్దతు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, ఐతరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటకు ఇతర చోట్ల అధిక ధర లభిస్తే అక్కడ కూడా విక్రయించుకోవచ్చని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా, రైతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వడ్ల కొనుగోలుతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించి రైతులకు అండగా నిలుస్తోందని వివరించారు. రానున్న వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోయి వరి పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
