కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు
- విద్యుత్ సరఫరా సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు
- బీఆర్‌ఎస్ నేత కల్లూరి రాంచంద్రారెడ్డి
- రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
- మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
యాదాద్రి, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని, దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని రాంచంద్రారెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
వేళాపాళా లేని విద్యుత్ కోతలతో బోరుబావులపై ఆధారపడిన రైతుల పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ కోతలను నిలిపివేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతుల తరఫున బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్
వలిగొండ, ఆంధ్రప్రభ: ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ రైతులను నట్టేట ముంచిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన సమరభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా అప్పుల పాలవుతున్నారని శేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న సాయాన్ని నిలిపివేసి రైతులను మోసం చేసిందని విమర్శించారు. విద్యుత్, సాగునీరు సక్రమంగా అందక ఎకరాల కొద్దీ పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని అన్నారు.
‘రుణమాఫీ’పై విమర్శలు
రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆంక్షల పేరుతో చాలామంది రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని శేఖర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగునీరు, విత్తనాలు, ఎరువుల సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మళ్లీ విద్యుత్ కోతలు, ఎరువుల కోసం రైతులు బారులు తీరే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
వరి సహా ఇతర పంటలకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు జరగక నిరీక్షించాల్సి వస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో నిర్వహించిన సమరభేరి కార్యక్రమాల్లో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, వెంకట్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, జనగాం పాండు, సట్టు తిరుమలేష్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ఏవీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
