యూరియా కోసం రైతుల గోస
లింకు ఎరువుల పేరుతో దోపిడీ ఆరోపణలు
యూరియా బస్తా కావాలంటే ఇతర ఎరువులు, పురుగుమందులు కొనాలంటూ ఒత్తిడి
అన్నదాతల ఆవేదన.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతుండగా.. ఇదే అదనుగా కొందరు ఎరువుల వ్యాపారులు లింకు విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా బస్తా కావాలంటే ఇతర ఎరువులు, పురుగుమందులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని కొందరు వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూరియా కోసం గంటల తరబడి నిరీక్షణ
పంటలకు అత్యవసరమైన యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. తీరా తమకు అవసరమైన మేరకు యూరియా ఇవ్వాలని కోరితే.. ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని కొందరు వ్యాపారులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అవసరం లేని ఎరువులూ అంటగడుతున్నారని ఆరోపణలు
సాగు పెట్టుబడులు ఇప్పటికే పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు లింకు విక్రయాలు మరింత భారంగా మారుతున్నాయని వారు వాపోతున్నారు. తమకు అవసరం లేని ఎరువులు, పురుగుమందులను కూడా కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తనిఖీలు ఎక్కడ?
యూరియా కొరతను ఆసరాగా చేసుకుని లింకు విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వ్యవసాయ శాఖ అధికారులు తగిన స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎరువుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, రైతులకు ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా చేపట్టి, లింకు విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని వారు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
