ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌పై అవగాహన

రైతులు ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలి..
కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని షేక్‌షాన్‌పల్లిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు రైతులకు ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌పై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు రైతులు పీఎండీఎస్‌ పద్ధతి ద్వారా విత్తనాలు నాటుకోవచ్చని ఆయన తెలిపారు. పంటలు బెట్టకు వచ్చినప్పుడు ఈ పద్ధతి ఉపశమనం కలిగిస్తుందన్నారు. పీఎండీఎస్‌ పద్ధతిలో విత్తనాలకు ఆవుపేడ లేదా బూడిదతో పూత వేస్తారని, దీనివల్ల మొక్కలు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.

మొక్కలు ఎక్కువ రోజులు తట్టుకుని నిలబడేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులైన బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం వంటి విధానాలను రైతులు పాటించడం వల్ల భూమిలో తేమను నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ను రైతులు తమ సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే రైతు గుర్తింపు సంఖ్య, ఈ-క్రాప్‌ బుకింగ్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు తమ పంటలను స్వయంగా బుక్‌ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పంటల బీమాకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు ఈ-క్రాప్‌ బుకింగ్‌ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. రైతులు తమ మొబైల్‌ ఫోన్లలో ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కంది పంట బెట్ట స్థితిలో ఉన్నందున రెండు గ్రాముల యూరియా ద్రావణం లేదా రెండు గ్రాముల పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. అనంతరం వ్యవసాయ అధికారులు కంది పంట పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ వెంకటనారాయణ, గ్రామ ఉద్యాన అధికారి రాజేశ్వరి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.