భూగర్భ జలాల పెంపునకు ఫార్మ్‌ కుంటలు

ఫార్మ్‌ కుంట నిర్మాణానికి శంకుస్థాపన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వ్యవసాయంలో నీటి నిల్వను పెంచడంతో పాటు భూగర్భ జలాల పునరుద్ధరణకు ఫార్మ్‌ కుంటలు ఎంతో దోహదపడతాయని స్వాములవారి లింగోటం గ్రామ సర్పంచ్‌, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు భీమిడి ప్రదీప్‌ జీ అన్నారు. చౌటుప్పల్‌ మండలం ఎస్‌. లింగోటం గ్రామంలోని ‘శివుని బావి చెల్క’లో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఫార్మ్‌ కుంట నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షం ఎప్పుడు పడుతుందో మన చేతుల్లో లేకపోయినా, పడిన ప్రతి వర్షపు నీటి బొట్టును ఎలా సంరక్షించుకోవాలో మన చేతుల్లోనే ఉందన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పొలాల నుంచి బయటకు వెళ్లే వర్షపు నీటిని ఫార్మ్‌ కుంటల్లో నిల్వ చేయడం ద్వారా భూమిలోకి నీరు ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. నేలలో తేమ శాతం పెరిగి పంటలకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారీ వర్షాల సమయంలో నీటిని గ్రామంలోనే నిల్వ చేయడం వల్ల పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఫార్మ్‌ కుంటలు ఎంతో ప్రయోజనకరమని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నీటి సంరక్షణ కుంటల నిర్మాణాలను మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ బాతరాజు ధనంజయ్య, గ్రామ కార్యదర్శి మచ్చగిరి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కళమ్మ, వార్డు సభ్యులు ఉప్పు వీరేశం, పిట్టల సదానందం, శోభ, పల్చం శంకరయ్య, బాతరాజు లింగస్వామి, చగనగోని సుశీల, తూర్పింటి సుజాత, షేగురి లింగస్వామి, రాధారపు సత్తయ్యతో పాటు గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.