పాక్ ISI ముఠాతో సంబంధాలున్న నిందితుడి అరెస్ట్…

పాక్ ISI ముఠాతో సంబంధాలున్న నిందితుడి అరెస్ట్…

రెండు నకిలీ పిస్టల్స్ స్వాధీనం.

మేడ్చల్, ఆంధ్రప్రభ : దేశ భద్రతకు విఘాతం కలిగించేలా అంతర్జాతీయ నేర సిండికేట్‌తో సంబంధాలు పెట్టుకున్న ఓ వ్యక్తిని మేడ్చల్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌తో పాటు కీలక ఆధారాలు ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం… ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌ (రెస్టారెంట్)లో పనిచేస్తున్నాడు. అయితే, ఇతనికి పాకిస్తాన్ గూఢచార సంస్థ (ISI) మద్దతు ఉన్న ఒక వ్యవస్థీకృత నేర ముఠాతో కలవాలనే బలమైన కోరిక ఉండేది. ఆ ముఠా ద్వారా ఎలాగైనా ఆయుధాలు సమకూర్చుకోవాలని జయీద్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించాడు.

​నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా నిరంతరం ఆ ముఠా సభ్యులతో టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. ​పాక్ ISI మద్దతు ఉన్న శక్తులకు లేదా ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పనిచేసే వారికి సహకరించడం, దేశ భద్రతకు ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా, జయీద్ ఖాన్ ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

​ముబారక్ రెస్టారెంట్‌లో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో మేడ్చల్ పోలీసులు అక్కడ మెరుపు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పంచుల (సాక్షుల) సమక్షంలో నిందితుడి నుంచి రెండు నకిలీ పిస్టాల్స్ స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి ఫోన్‌ను పరిశీలించగా అందులో దేశ వ్యతిరేక ముఠాలతో జరిపిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్ స్క్రీన్ షాట్లు లభ్యమయ్యాయి. బెదిరింపులకు లేదా ఇతర నేరాలకు వాడటానికి సిద్ధం చేసుకున్న రెండు నకిలీ పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ​ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు..

Leave a Reply