తన పేరు, ఫొటోతో నకిలీ సందేశాలు.. స్పందించొద్దన్న కలెక్టర్‌

ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి: జిల్లా కలెక్టర్‌ పేరుతో నకిలీ వాట్సాప్‌ సందేశాలు పంపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తన పేరు, ఫొటోను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు అధికారులకు సందేశాలు పంపుతున్నారని జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.

తన పేరు, ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకుని ఓ గుర్తుతెలియని నంబర్‌ నుంచి అధికారులకు సందేశాలు వస్తున్నట్లు గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. ఆ నంబర్‌ నుంచి వచ్చే సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించవద్దని సూచించారు. సంబంధిత నంబర్‌ను వెంటనే బ్లాక్‌ చేసి, వాట్సాప్‌లో రిపోర్ట్‌ చేయాలని కోరారు.

కలెక్టర్‌ పేరు, ఫొటో కనిపించిందనే కారణంతో అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దని స్పష్టం చేశారు. సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి సందేశాల ద్వారా డబ్బులు, బహుమతి కార్డులు కోరే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు లేదా ఇతర ప్రయోజనాలు కోరితే స్పందించవద్దని సూచించారు.అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, పాస్‌వర్డ్‌లు, రహస్య సంకేత సంఖ్యలు (OTP) వంటి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని కలెక్టర్‌ సూచించారు.

ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు, ఫొటోలను ఉపయోగించి ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. తన పేరుతో అనుమానాస్పద సందేశాలు వస్తే వాటికి స్పందించకుండా సంబంధిత సైబర్‌ నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఇలాంటి సైబర్‌ మోసాలపై ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కోరారు.