రైతు భరోసా పేరుతో రైతులకు ఫేక్‌ మెసేజ్‌లు!

  • సైబర్‌ క్రైమ్‌కు వ్యవసాయ శాఖ ఫిర్యాదు
  • 2,73,128 మంది రైతులకు సందేశాలు వెళ్లినట్లు గుర్తింపు
  • తాము ఎలాంటి ఎస్‌ఎంఎస్‌లు పంపలేదని స్పష్టం
  • సందేశాల మూలం, బాధ్యులను గుర్తించాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్రంలోని సుమారు 2,73,128 మంది రైతులకు అనధికారికంగా ఎస్‌ఎంఎస్‌లు పంపిన ఘటనపై వ్యవసాయ శాఖ సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేసింది. ఈ సందేశాలను తాము పంపలేదని, వాటికి ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపీ నవంబర్‌ 4న తెలంగాణ డీజీపీ, సైబర్‌ క్రైమ్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు.

రైతు భరోసా పథకానికి సంబంధించి పెద్ద సంఖ్యలో రైతులకు ఎస్‌ఎంఎస్‌లు అందినట్లు సీడీఏసీ పోర్టల్‌ నివేదిక ద్వారా వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆ సందేశాలను తాము పంపలేదని, రైతులకు పంపేందుకు ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రైతులకు అధికారిక సమాచారాన్ని చేరవేసేందుకు వ్యవసాయ శాఖ సీడీఏసీ ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ పోర్టల్‌ను వినియోగిస్తోందని, అయినప్పటికీ ప్రస్తుతం రైతులకు చేరిన సందేశాలను ఆ పోర్టల్‌ ద్వారా తాము పంపలేదని వివరించారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ పేరును దుర్వినియోగం చేసి ఉండవచ్చని, ఎస్‌ఎంఎస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించి లేదా ఇతర ఎస్‌ఎంఎస్‌ గేట్‌వేల ద్వారా ఈ సందేశాలను పంపి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

సందేశాల మూలాన్ని గుర్తించాలి

రైతులకు పంపిన ఎస్‌ఎంఎస్‌ల మూలాన్ని గుర్తించడంతో పాటు వాటిని పంపిన వ్యక్తులు, సంస్థలు లేదా ఏజెన్సీల వివరాలను వెలికితీయాలని సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని వ్యవసాయ శాఖ కోరింది. సీడీఏసీ ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ పోర్టల్‌ లేదా ఇతర ఎస్‌ఎంఎస్‌ గేట్‌వేలలో అనధికారిక ప్రవేశం, దుర్వినియోగం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. అందుబాటులో ఉన్న మేరకు ఎస్‌ఎంఎస్‌ గేట్‌వే, సెండర్‌ ఐడీ, సందేశాల ప్రసార లాగ్‌లు, సంబంధిత ఐపీ చిరునామాలు సహా సాంకేతిక వివరాలను పరిశీలించాలని కోరింది.

ఈ అనధికారిక సందేశాల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు లేదా ఏజెన్సీలను గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సందేశాల వల్ల రైతుల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా వ్యవసాయ శాఖ, రైతు భరోసా పథకం విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.