హైదరాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా అరెస్ట్‌..

  • రూ.2.91 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం..
  • ప్రింటర్‌, స్కానర్‌, ఇతర పరికరాలు స్వాధీనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టు రట్టైంది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు రూ.2.91 లక్షల విలువైన నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన ప్రింటర్‌, స్కానర్‌, లామినేటర్‌ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

షామీర్‌పేట, బాలాపూర్‌ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ (షామీర్‌పేట జోన్‌) పోలీసులు, బాలాపూర్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్ల తయారీ వ్యవహారం బయటపడింది.

పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో చింతల్‌తండా, వడ్డిపట్లకు చెందిన రామావత్‌ రాము అలియాస్‌ మహ్మద్‌ (36), అతడి బంధువు రామావత్‌ మోతీలాల్‌ (35), రామావత్‌ గాంధీ (19) ఉన్నారు. వీరిలో రాము ఫుడ్‌ డెలివరీ ఉద్యోగిగా, మోతీలాల్‌ ర్యాపిడో డ్రైవర్‌గా, గాంధీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి సహకరించినట్లు భావిస్తున్న నాగోల్‌-బండ్లగూడకు చెందిన సుధీర్‌ జాన్‌ చెలా అలియాస్‌ వంశీ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నకిలీ కరెన్సీ తయారీ విధానం గురించి రాము, మోతీలాల్‌ సోషల్‌ మీడియా వేదికల ద్వారా తెలుసుకున్నారు. నకిలీ నోట్లు తయారు చేయడం గురించి యూట్యూబ్‌లో వచ్చిన వీడియోలను చూసి ఈ ముఠా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కలర్‌ ప్రింటర్‌, స్కానర్‌, బాండ్‌ పేపర్‌, ఇతర సామగ్రిని కొనుగోలు చేసి నకిలీ రూ.500, రూ.200, రూ.100 నోట్లను తయారు చేసినట్లు గుర్తించారు.

ఈ ముఠా రాత్రి సమయాల్లో వైన్‌ షాపులు, కూరగాయల మార్కెట్లలో చిన్న మొత్తాల్లో నకిలీ నోట్లను చలామణి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాముకు బంధువైన గాంధీ ద్వారా మార్కెట్లలో నకిలీ నోట్లను పంపిణీ చేయించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు.

నిందితుల నుంచి 437 నకిలీ రూ.500 నోట్లు, 39 నకిలీ రూ.200 నోట్లు, 648 నకిలీ రూ.100 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2,91,100గా పోలీసులు వెల్లడించారు. అలాగే నోట్ల తయారీకి ఉపయోగించిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. నకిలీ కరెన్సీ తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా.. ఈ నోట్లు ఎక్కడెక్కడ చలామణి అయ్యాయి.. అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న సుధీర్‌ జాన్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.