అమిత్ షా పర్యటనకు పటిష్ట భద్రత

  • ప్రతిమ వైద్య కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకల నేపథ్యంలో పోలీసుల విస్తృత ఏర్పాట్లు

కరీంనగర్‌, ఆంధ్రప్రభ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అక్టోబర్‌ 4న కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం సీపీ గౌష్‌ ఆలం ఆధ్వర్యంలో అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ (ఏఎస్‌ఎల్‌) సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్‌, సభా వేదిక, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు.

అక్టోబర్‌ 4న ప్రతిమ డీమ్డ్‌ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన, సిల్వర్‌ జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ, ఫొటో ఎగ్జిబిషన్‌, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రతిమ మెడికల్‌ కాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు.