దరఖాస్తుల గడువు పొడిగింపు..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిధిలోని ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు చివరి తేదీని సెప్టెంబర్ 20, 2026 వరకు పొడిగించినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపారు.
రెండో శనివారం, ఆదివారం, పండుగలు, ఇతర వరుస సెలవుల కారణంగా దరఖాస్తుల సమర్పణకు మరింత సమయం ఇవ్వాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా తొలుత 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ విధానంలో ఇండ్ల కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
ప్రస్తుతం మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాలు చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్ ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసినప్పటికీ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వరుస సెలవులు, పండుగలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 20 వరకు అవకాశం కల్పించినట్లు వి.పి. గౌతమ్ తెలిపారు. సంబంధిత నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు.
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని హౌసింగ్ కమిషనర్ స్పష్టం చేశారు. పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను tghb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించాలని సూచించారు.
