ఏజెన్సీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి..

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన సంఘ నాయకులు

జైనూర్, ఆంధ్రప్రభ: ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 19న బుధవారం ఏజెన్సీ బంద్ నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ నాయకులు తెలిపారు. ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో ఆదివాసీ అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన విధంగానే ఆదివాసీ అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో జైనూర్ మండలంలోని వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు ఏజెన్సీ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపి సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ అభ్యర్థుల హక్కుల కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని కోరారు. బంద్‌కు సహకరించాలని కోరుతూ జైనూర్ తహసీల్దార్ ఆడ బీర్షావ్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఆదివాసీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధురాజ్ మడావి, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం అర్జున్, తుడుందెబ్బ నాయకులు చాహకటి గణేష్, కోట్నాక ప్రకాష్, మెస్రం గోపాల్, ఆనక వెంకటేష్, తుమ్రం దిలీప్ కుమార్, మర్సుకోలా సంజీవ్ కుమార్, ఆత్రం శంకర్, ఆడ దుందేరావ్ తదితరులు పాల్గొన్నారు.