Exclusive | సంక్షేమ .. స్వర్ణాంధ్ర కేర్ టేకర్! – విభిన్నంగా చంద్రబాబు 2.0 పాలన

కూటమికి పెద్దదిక్కుగా దిశానిర్దేశం
• సీనియర్లకు గౌరవం.. యువతకు ప్రోత్సాహం వ్యూహాత్మకంగా అడుగులు
• పక్కా ప్రణాళికతో అభివృద్ధి అమరావతికి సరైన రూపు
• పోలవరం సహా ప్రాజెక్టులపై ఫోకస్
• అటు పార్టీ బలోపేతానికి చర్యలు.. ఇటు పాలనపై తనదైన ముద్ర
• కేంద్రంతో సాన్నిహిత్యం రాష్ట్ర ప్రయోజనాలే కీలకం

విజనరీ నేతగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అటు సీనియర్లను గౌరవిస్తూనే.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతను కూడా ప్రోత్సహిస్తుండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు పర్యాయాలు.. ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన.. భవిష్యతకు బాటలు వేసేలా.. గతానికి భిన్నంగా.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది… అటు రాజధాని అమరావతికి తుదిరూపు తీసుకొచ్చే ప్రయత్నాలతో పాటు.. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. అటు కూటమికి కేర్ టేకర్ మారి.. పెద్దన్న పాత్ర పోషిస్తూనే.. ఇటు సొంత పార్టీ నేతలను సైతం గాడిలో పెట్టడం.. చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తోంది.

పసునూరి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ , ఆంధ్రప్రభ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విజనరీ నేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త అధ్యయనానికి తెర లేపినట్లు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన పాలనా వ్యవహారాలు సాగిస్తుండటం రాజకీయ విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు పర్యాయాలు, విభజితఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, వ్యూహాత్మకంగా, గతానికి భిన్నంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనా లకు పెద్దపీట వేస్తూ, పాలనాపరమైన సంస్కరణలను అదేరీతిలో కొనసాగిస్తున్నారు. కేడర్ కు, ప్రజలకు సమయం కేటాయించరని తొలిసారి ఏపీ ముఖ్య మంత్రిగా వ్యవహరించిన సందర్భంలో వినిపించిన భిన్నాభిప్రాయాలకు సీఎం చంద్ర బాబు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. అటు సీనియర్ నేతలకు, ఇటు యువతరానికి సమయం కేటాయించడంతో పాటు, పాలనాపర మైన అంశాల్లోనూ అందరికీ తగిన ప్రాధాన్యత నిస్తున్నట్లు కని పిస్తోంది.

2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమిగా ముందుకెళ్లేందుకే మొగ్గుచూపిన చంద్రబాబు నాయుడు, చాలామంది సీనియర్లకు పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో సీట్లను కేటాయించలేక పోయారు. ఆ సమయంలో చాలామంది సీని యర్లను పక్కన పెట్టారనే విమర్శలు సైతం వినిపించాయి. ఇదిలా ఉండగా సీనియర్ నాయకుడైన అశోక గజపతి రాజుకు గవర్నర్ అవకాశం కల్పించడంతోపాటు, అనేక మంది సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు అందించడం ద్వారా వారి సీనియారిటీని సముచితంగా గౌరవించినట్లయిం దన్న చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు కేంద్ర కేబినెట్లో యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడుకు చోటు కల్పించేలా చేయడం వెనుక యువతను ప్రోత్సహించినట్లు ఆయిందని విశ్లేషకులు పేర్కొం టున్నారు. తెలుగుదేశం పార్టీకోసం రామ్మోహన్నాయుడి తండ్రీ, మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపునిచ్చినట్లు అయిందని వారు పేర్కొంటున్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనలో మరింత వేగం, తేజం పెరిగినట్లు కనిపిస్తోందని రాజ కీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రజల్లోకి వెళ్లకుండా కాలయాపన చేసే ప్రజాప్రతినిధుల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు నిత్యం దిశా నిర్దేశం చేస్తూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వారిని కార్యోన్ముఖులను చేస్తూ వస్తున్నారు. యువతకు పెద్దపీట వేస్తూనే, సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగతపరమైన నిర్మాణానికి ఆయన ప్రాధాన్యతనిస్తున్నారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కోటి సభ్యత్వాలు చేర్పించడం, ప్రాంతీయ పార్టీల చరిత్రలోనే గొప్ప మైలురాయిగా నిలిచింది. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేలా సభ్యత్వ నమోదుతో పాటు రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించడం ద్వారా బాధిత పార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా సాగిస్తున్న చర్యలు, పాలనాపరమైన సంస్కరణలు ఆయనలోని ఆశావహ దృక్పథా నికి, ముందుచూపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయని విపక్షాలకు చెందిన నేతలే కొందరు కొనియాడుతున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూద్దాం

కూటమికి కేర్ టేకర్..

చంద్రబాబు నేతృత్వంలో మహాకూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేశాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేంత స్పష్టమైన ఆధిక్యం, మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ, ఎక్కడా కూటమి లక్ష్యానికి తూట్లు పొడవలేదు. బీజేపీ, జనసేనలకు టికెట్ల కేటాయింపు నుంచి, ప్రచారం, ఫలితాలు వచ్చే వరకు ఆయన అదే అభిప్రాయం, దృఢచిత్తంతో ముందుకు సాగారు. టీడీపీ, జనసేన, బీజేపీలు ఐక్యంగా ముందుకు సాగేందుకు అవస రమైన అన్ని చర్యలను చంద్రబాబు తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుపై ఎన్నోరకాల వత్తిళ్లు, ప్రతికూల |కూటమికి వాతావరణం ఏర్పడినప్పటికీ, కూటమిగా ముందుకు కేర్ టేకర్ సాగేందుకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా ఆయన కూటమికి కేర్ టేకర్గా మారి పెద్దన్న పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఏర్పాటులోనూ భాగస్వామ్య పక్షాలకు ఆయన పెద్దపీట వేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడారు. డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు అవకాశమివ్వడమే కాక, ఆయన కోరుకున్న శాఖను కేటాయించారు. కేబినెట్ సమావేశా ల్లోనూ పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి, కూటమిని ఏకతాటిపై నడిపించేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలోనే అమరావతి కోసం మరోసారి భూ సేకరణ అంశం తెరపైకి రాగా, పవన్ విముఖంగా ఉండటంతో విరమించుకున్నట్లు ప్రచారం జరు గుతోంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు సైతం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, జనసేనకు ప్రాధాన్యతనిచ్చారు. మరోవైపు బీజేపీకి కూడా ప్రభుత్వ ఏర్పాటులో తగినన్ని అవకాశాలు కల్పించడంతోపాటు, కేంద్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా కూటమి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతూ తగిన పట్టు సంపా దించారు. మరోవైపు రాజ్యసభ సభ్యులుగా ఆర్.కృష్ణయ్య, పాశా వెంకట సత్యనారాయణలకు అవకాశం కల్పించి, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ప్రాతినిథ్యం ఉండేందుకు అండగా నిలిచారు. అటు టీడీపీలోనూ అసంతృప్తులను ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ, వ్యతిరేకత మూటగట్టుకున్న వారికి హెచ్చరికలు చేస్తూ, సున్నితంగా ఆయా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు.

విజనరీ నేతగా విశిష్ట గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆమరావతికి తుదిరూపు తీసుకొచ్చేం దుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనునిత్యం శ్రమిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అమరావతీ విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోయారన్న అభిప్రాయం గతంలో వినిపించగా, అందుకు భిన్నంగా ఈ దఫా అమరావతితో పాటు, పోలవరం వంటి ప్రాజెక్టులను పూర్తిచేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అందుకోసం కేంద్రం నుంచి పెద్దమొత్తంలో నిధులను సైతం ఆయన రాబట్టగలిగారు. అంతే కాకుండా వెనుకబాటుకు గురవుతున్న రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా మార్చుకొని బనకచర్ల వంటి ప్రాజెక్టు అనుమతుల కోసం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. తెలంగాణ నుంచి పూర్తిస్థా యిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ విమర్శలకు వెరవ కుండా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. మరోవైపు అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. మరో వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న ఆశయంతో చంద్రబాబు నిధులను సమీకరిస్తున్నారు. మానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడం, అభివృద్ధి పను లను త్వరితగతిన పూర్తి చేయడం, సంక్షేమ పథకాల అమలులో వెన్ను చూపకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది

Leave a Reply