సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :ప్రపంచ దేశాల్లో ఒక దేశంపై మరో దేశం పెత్తనం చెలాయించేందుకు ఆయా దేశాల్లోని వీక్నెస్లను తెలుసుకుని దెబ్బతీసే హ్యాహాలను పన్నుతుంటారు.
అంతర్గత పరిస్థితులను తెలుసుకుంటారు. ఆయుధాలు, ఆర్థికం, సంపద వంటి విషయాలతో పాటు రాజకీయంగా జరిగే పరిణామాలను తెలుసుకునేందుకు స్పై ఏజెంట్లను నియమించుకుంటారు. అయితే.. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా చైనా నుంచి ఎదురయ్యే ముప్పును తెలుసుకుని దానికి తగ్గట్టు వ్యూహాలను రెడీ చేసుకుంటుంది. దీని కోసం ప్రత్యేక గూఢచారులను రంగంలోకి దింపుతుంది.. అయితే.. ఈ మధ్య చైనాలో నెలకొన్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని అక్కడి అధికారులను ఏకంగా అమెరికా గూఢచార సంస్థ సీఐఏ లో నియామకాలు చేసుకోవాలని ప్లాన్ చేసింది.
దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ట్విట్టర్లో వైరల్‌గా మారింది. కాగా, ‘‘నా జీవితం, నా భవిష్యత్, నా కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి’’ అనే మాటలు హైలైట్ చేస్తూ ప్రత్యేక వీడియో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది.
జిన్‌పింగ్‌కు ఎదురుమాట్లాడితే అంతే..చైనాలో ఎంత పెద్ద అధికారి అయినా సరే భయంభయంగానే బతకాల్సిన పరిస్థితి.. నిన్నటి దాకా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు కుడిభుజంలా వ్యవహరించిన వ్యక్తి ఈ రోజు హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. ఆ వ్యక్తి ఏమయ్యాడనేది ఎవరికీ తెలియదు. దాని గురించి మాట్లాడితే తమకూ అదే గతి పడుతుందని మిగతావారు భయపడుతుంటారు. సాధారణ ఉద్యోగులతో పాటు ఉన్నత స్థానంలో ఉన్న వారిపైనా అణచివేత కొనసాగుతోంది. ఈ అణచివేతను అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తనకు అవకాశంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది.
అణచివేతపై వీడియోలు..జిన్ పింగ్ పాలనలో అణచివేతకు గురవుతున్న అధికారులకు సీఐఏ ఆహ్వానం పలుకుతోంది. సీఐఏలో చేరాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రెండు వీడియోలను రూపొందించి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ వీడియోలను చూసినట్లు సమాచారం. చైనీయులను ఆకట్టుకునేందుకు ‘రండి.. మాతో కలిసి పనిచేయండి’ అంటూ మాండరిన్ భాషలో ఈ వీడియోలను రూపొందించారు..
సైనిక పరంగా, వ్యూహాత్మకంగా చైనా తమకు అతిపెద్ద విరోధిగా అగ్రరాజ్యం భావిస్తోంది.చైనా రహస్య ఆపరేషన్లు తెలుసుకునేందుకే..చైనా చేపడుతున్న రహస్య ఆపరేషన్ల గుట్టు తెలుసుకోవడానికే ఈ నియామకం చేపట్టామని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బహిరంగంగానే వెల్లడించారు.
‘‘సీఐఏలో మానవ వనరులను పెంచుకోవడంతో పాటు చైనాపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నియామకం చేపట్టాం. డ్రాగన్ నుంచి మాకు గూఢచర్యం ముప్పు పొంచి ఉంది. దాన్ని పరిష్కరించుకునేందుకే ఈ ప్రయత్నం. చైనా అధికారులను సీఐఏలో చేర్చుకుని డ్రాగన్ రహస్యాలు సేకరించడమే వాటి లక్ష్యం’’ అని రాట్క్లిఫ్ వెల్లడించారు. జిన్‌పింగ్ అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ఉదహరిస్తూ సినిమాటిక్ సన్నివేశాలను ఈ వీడియోల్లో జోడించారు. ‘నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా కంట్రోల్లో ఉంచుకోవాలంటే సీఐఏలో చేరాలి’ అనే క్యాప్షన్‌తో అమెరికా సంస్థ ఈ వీడియోలను విడుదల చేసింది.