Exclusive | టెర్రర్​పై వార్​! యాక్షన్ మోడ్ యాక్టివేట్‌

రెడీగా ఉన్న భారత త్రివిధ దళాలు
నింగి, నేల‌, నీరు అన్నింటా సమాయత్తం
ర‌క్ష‌ణ ప‌రంగా ఎంతో మెరుగ్గా ఉన్న భార‌త్‌
సాధానా సంప‌త్తిలో ఇతర దేశాలకంటే బెస్ట్
ప్ర‌పంచ దేశాల్లోనే టాప్ ఫోర్ ప్లేస్ సొంతం
ర‌ఫేల్‌, సుఖోయ్ వంటి ఆధునిక యుద్ధ విమానాలు
అరెబియాలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌
9వ ర్యాంకు నుంచి 12వ స్థానానికి పడిపోయిన పాకిస్తాన్​
అత్యంత పటిష్టమైన ఆర్మీ సిబ్బంది సొంతం
భారత అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధాలు
వివరాలు వెల్లడించిన గ్లోబల్​ ఫైర్​ పవర్​ ఇండెక్స్​

= సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ – పాక్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే.. ఇంకోసారి పాకిస్థాన్ సైన్యం గానీ, ఆ దేశం ఎగదోసే టెర్రరిస్టులు గానీ.. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే.. ఒక్కొక్కడికి ఎకరం తడిసిపోయేలా ప్రతీకారం ఉండాల‌నే వాద‌న‌లున్నాయి. ఇప్పటికే వివిధ రకాలుగా పాకిస్థాన్‌పై భారత స‌ర్కారు చర్యలు తీసుకుంది. పాక్‌ని ఎడారి చేసేందుకు.. వ్యూహాత్మకంగా సింధూ నది జలాలను ఆపేసింది. సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతని పెంచింది.

ట్ర‌య‌ల్స్ వేస్తున్న త్రివిధ ద‌ళాలు..

ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ.. ఇలా త్రివిధ దళాలన్నీ ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా.. పాకిస్థాన్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన రఫేల్, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు సన్నద్ధమైపోయాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి ఎంటరైపోయింది. భారత దళాలన్నీ.. పాకిస్థాన్ వైపు క‌దిలాయి. దీంతో రెండు దేశాల సరిహద్దుల్లో హీట్ పెరిగిపోయింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడంతో.. పాకిస్థాన్ అప్పుడే కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది.

పాకిస్థాన్ తట్టుకోగలదా?

అవతలి వైపు నుంచి పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. భారత సైన్యం దీటుగా బదులిస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ తన యుద్ధ విమానాలను కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి భారత సరిహద్దులకు దగ్గరగా ఉన్న లాహోర్, రావల్పిండి ఎయిర్‌బేస్‌లకు త‌ర‌లించింది. ఈ వరుస పరిణామాలన్నింటిని చూస్తుంటే రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో.. ఇప్పుడు గనక ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి బలమెంత? సైనిక బలగమెంత? అనే చర్చ సాగుతోంది.

9వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయిన పాకిస్థాన్

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైన్యాల జాబితాలో భారత్.. నాలుగో స్థానంలో ఉంది. ఇదే సమయంలో పాకిస్థాన్.. తొమ్మిదో స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్.. ఒక దేశం పోరాట సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు.. ఆ దేశ జీడీపీ, జనాభా, సైనిక బలం, ఆయుధాలు, కొనుగోలు శక్తి లాంటి 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ బడ్జెట్ 6 లక్షల 80 వేల కోట్లుగా ఉంది.

భారత్ వ‌ద్ద సరికొత్త ఆయుధాలు..

దేశ రక్షణ విషయంలో భారత్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అధునాతన ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. యుద్ధం వచ్చినా, రాకపోయినా.. పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్‌, చైనాని నమ్మటానికి వీల్లేదు. అందుక‌ని భారత్ ర‌క్ష‌ణ‌రంగం, ఆయుధ సంప‌త్తి విష‌యంలో ఒక అడుగు ముందే ఉంటోందని తెలుస్తోంది.

వారి సైనిక బలగమెంత? ఆయుధ బలమెంత?

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. త్రివిధ దళాల బలగాల విషయంలో భారత్-పాక్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సైనికుల పరంగా చూస్తే.. భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 14 లక్షల 55 వేల 550 మంది యాక్టివ్ ఫోర్స్ ఉంటే.. పాకిస్థాన్‌ దగ్గర 6 లక్షల 54 వేల మంది సైన్యమే ఉంది. భారత్ దగ్గర రిజర్వ్ ఫోర్సెస్ 11 లక్షల 55 వేల మంది ఉంటే.. పాకిస్థాన్ దగ్గర 2 లక్షల 80 వేల ఫోర్స్ మాత్రమే ఉంది. ఇక.. పారామిలిటరీ దళాల విషయానికొస్తే.. భారత్ దగ్గర 25 లక్షల 27 వేల మంది బలగాలు ఉండగా.. పాకిస్థాన్ దగ్గర 5 లక్షల పారామిలిటరీ దళం మాత్రమే ఉంది. మొత్తంగా చూసుకుంటే.. ఇండియా దగ్గర మిలిటరీ ఫోర్స్ 51 లక్షల 37 వేలకు పైగా ఉంటే.. పాకిస్థాన్ దగ్గర మొత్తం సైన్యం కలిపి 14 లక్షల 34 వేల మంది ఉన్నారు.

యుద్ధ ట్యాంకుల్లోనూ.. భారత్ ఆధిపత్యమే

మన దగ్గర 4 వేల 201 యుద్ధ ట్యాంకులు ఉండగా.. పాకిస్థాన్ దగ్గర 2 వేల 627 ఉన్నాయి. సాయుధ వాహనాలు భారత్ దగ్గర లక్షా 48 వేల 594 ఉన్నాయి. పాక్ దగ్గర కేవలం 50 వేల 523 మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్ భారత్ దగ్గర 2 వేల 415 ఉంటే.. పాకిస్థాన్ దగ్గర 2 వేల 300 ఉన్నాయి. ఇక.. ఆర్మ్‌డ్ పర్సనల్ క్యారియర్స్.. భారత్ దగ్గర 4 వేల 391 ఉండగా.. పాకిస్థాన్ దగ్గర 14 వందలు మాత్రమే ఉన్నాయి. ఫీల్డ్ ఆర్టిలరీ ఇండియా దగ్గర 3 వేల 975 ఉండగా.. పాక్ దగ్గర 2 వేల 629 ఉన్నాయి. ఇవే గాక.. ఇండియన్ ఆర్మీ దగ్గర టీ-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ మిస్సైల్, పినాక రాకెట్ సిస్టమ్ లాంటి అధునాతన ఆయుధాలున్నాయి.

ఇండియా దగ్గర 2 వేల 229 ఎయిర్‌క్రాఫ్ట్స్

ఎయిర్‌ఫోర్స్ విషయానికొస్తే.. పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. భూమి మీదే కాదు గగనతలంలోనూ మన ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇండియా దగ్గర మొత్తం 2 వేల 229 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉండగా.. వాటిలో 513 యుద్ధ విమానాలున్నాయి. పాకిస్థాన్ దగ్గర మొత్తం 13 వందల 99 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉండగా.. వాటిలో 328 యుద్ధ విమానాలున్నాయి. ఐఏఫ్ దగ్గర 6 ఏరియల్ ట్యాంకర్లు ఉండగా.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 4 ఏరియల్ ట్యాంకర్లే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 899 హెలికాప్టర్లు ఉండగా.. పాక్ దగ్గర 373 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి.

ఇండియా దగ్గర 18 సబ్‌మెరైన్లు

భారత్‌కు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో.. ఆర్థిక, భద్రతా ప్రయోజనాలతో కూడిన పొడవైన సముద్ర సరిహద్దు కలిగి ఉంది. అదే.. పాకిస్థాన్ మాత్రం కేవలం అరేబియా వెంబడి మాత్రమే సముద్ర సరిహద్దు కలిగి ఉంది. ఇక.. పాకిస్థాన్ నావల్ ఫ్లీట్‌తో పోలిస్తే.. భారత నావికాదళం చాలా పెద్దదే కాదు.. అంతకుమించి బలమైనది కూడా. ఇండియా దగ్గర 293 నౌకల నావల్ ఫ్లీట్ ఉంటే.. పాకిస్థాన్ దగ్గర కేవలం 121 నౌకల నావల్ ఫ్లీట్ మాత్రమే ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ విషయానికొస్తే.. ఇండియాదే పైచేయిగా ఉంది. మన దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. పాకిస్థాన్ దగ్గర ఇలాంటివి ఒక్కటి కూడా లేవు. ఇక.. ఫ్రిగేట్స్ భారత్ దగ్గర 14 ఉంటే.. పాక్ దగ్గర 9 ఉన్నాయి. నేవీలో కీలకమైన సబ్‌మెరైన్ల విషయానికొస్తే.. రెండు దేశాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఇండియా దగ్గర 18 సబ్‌మెరైన్లు ఉన్నాయి. ఇందులో.. బాలిస్టిక్ మిస్సైల్‌ని ఫైర్ చేసే సిస్టమ్ కూడా ఉంది. అదే.. పాకిస్థాన్ దగ్గర కేవలం 8 సబ్‌మెరైన్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు.

డిస్ట్రాయర్లు, కార్వెట్‌లు, ఫ్రిగేట్‌లు

ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్‌తో పాటు డిస్ట్రాయర్లు, కార్వెట్‌లు, ఫ్రిగేట్‌ల లాంటివన్నీ.. ఇండియాని బ్లూ వాటర్ నేవీగా మార్చాయి. అంటే.. ఇండియా ప్రపంచవ్యాప్తంగా పనిచేయగలిగే మారిటైమ్ ఫోర్స్‌గా ఉంది. మన దగ్గరున్న యుద్ధ విమానాలను, ఇతర ఆయుధ వ్యవస్థలను.. మన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లతో ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అదే పాకిస్థాన్ నేవీ.. గ్రీన్ వాటర్ నేవీగా పనిచేస్తోంది. అంటే.. పాక్ నావికాదళం బలం తన సముద్ర సరిహద్దుకు మాత్రమే పరిమితం. సైనిక బలం పరంగా భారత్‌తో పాక్‌కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *