సింగ‌రేణిలో మితిమీరిన రాజ‌కీయ జోక్యం

సింగ‌రేణిలో మితిమీరిన రాజ‌కీయ జోక్యం

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : సింగరేణి బొగ్గు పరిశ్రమ లాభాలు, లాభాల్లో వాటా ప్రకటనకు సంబంధించి సింగరేణి(Singareni) గుర్తింపు సంఘానికి ప్రాధాన్యత ఇవ్వ‌కుండా ఏకపక్షంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్(colliery workers) యూనియన్ (ఏఐటీయూసీ) మండిప‌డింది. వాటాను ప్రకటించిన‌ విధానంపై ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.

ఈ రోజు గోదావరిఖని ప్రెస్‌క్ల‌బ్‌(Press Club)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ లాభాలు వాటాను ప్రకటించే ముందు గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలతో చర్చించిన తర్వాతనే ప్రకటన జరగడం అనేది గతం నుండి వస్తున్న ఆనవాయితీ అన్నారు. అయితే ఆ విధానానికి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలకడాన్ని తప్పుపట్టారు.

పెరిగిపోతున్న రాజ‌కీయ జోక్యం

సింగరేణిలో రోజురోజుకు రాజకీయ జోక్యం పెరిగిపోతుందని, రాజకీయ జోక్యంలో గతంలోని కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt) కిటికీలు తీస్తే, రేవంత్ రెడ్డి సర్కార్ ఏకంగా తలుపులు తీస్తుందని సీతారామయ్య ఆరోపించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందన్నారు. నికర లాభాలపై సరైన విధంగా వాటా చెల్లింపులు జరిగి ఉంటే కార్మికులకు మరింత న్యాయం జరిగి ఉండేది అన్నారు. లాభాల్లో వాటా(share in profits)కు సంబంధించి 35% చెల్లింపులు జరగాల్సి ఉండేదని అన్నారు. అదేవిధంగా వాటా చెల్లింపుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు.

కొత్త బొగ్గు గ‌నుల సాధ‌న‌కు స్వాగ‌తం

సింగరేణిలో కొత్త బొగ్గు గనుల సాధన కోసం సంస్థ వేలంలో పాల్గొంటే అందుకు తమ సంఘం స్వాగతిస్తుందని సీతారామయ్య అన్నారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కలది తలో విధానం ఉంది అన్నారు.

అంగీకరించిన అంశాలపై సింగరేణి సంస్థ సర్క్యులర్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు అని కార్మికులకు న్యాయం జరిగే విషయంలో సింగరేణి కార్లుస్ వర్కర్స్ యూనియన్ ఎప్పుడు కూడా ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు మడ్డి ఎలాగౌడ్, వైవి రావు, రాజరత్నం, రవీందర్, గౌతమ్, గోవర్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply