వికారాబాద్‌ బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా

వికారాబాద్‌, ఆంధ్రప్రభ : వికారాబాద్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడి వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు శనివారం పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌, క్యాసారం గ్రామాలకు చెందిన 51 మంది చింతకుంట గ్రామానికి అంత్యక్రియలకు బస్సులో బయలుదేరారు. కొత్తగడి నారాయణరెడ్డి (50) అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వారు వెళ్తుండగా అనంతగిరి కొండల డౌన్‌ రోడ్డులోని మలుపు వద్ద బస్సు అదుపుతప్పి కుడివైపు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. మొత్తం 43 మందిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. 25 మందిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. మరో 10 మంది ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, ఎనిమిది మందిని బంధువుల కోరిక మేరకు డిశ్చార్జి చేశారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బస్సు ట్రావెల్స్‌ యాజమాన్యంతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలు, బాధ్యులపై సమగ్రంగా విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.