ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
- ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశం
నరసరావుపేట, ఆంధ్రప్రభ: జిల్లాలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్లా తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లపై ఆర్వోలు, ఏఆర్వోలు, రూట్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్లు, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రాకపోకలకు అనుకూలమైన మార్గాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా రూట్, సెక్టార్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపును ర్యాండమైజేషన్ పద్ధతిలో పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సిబ్బంది నిర్ణీత సమయానికి తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బ్యాలెట్ పత్రాలపై ప్రత్యేక దృష్టి
ప్రతి పోలింగ్ కేంద్రానికి అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులతో కూడిన బ్యాలెట్ పత్రాలను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పత్రాల పంపిణీ, భద్రపరచడం, వినియోగం, సీలింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు కౌంటింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ ఒక్క అభ్యర్థికి లేదా రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన కలగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం
బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పైకప్పుల నుంచి నీరు లీకేజీ కాకుండా, బ్యాలెట్ బాక్సులు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. అవసరమైన చోట రిజర్వ్ సిబ్బందిని వినియోగించుకుంటామన్నారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహించినట్లు వెల్లడించారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ సమయంలో పీఓఎస్ విధానం ద్వారా జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తామని, సంబంధిత యాప్ డౌన్లోడ్, సాంకేతిక సమస్యలను ముందుగానే పరిశీలిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమాచార సేకరణ, నమోదు, పంపిణీ తదితర ప్రక్రియలను ఆన్లైన్లో సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
