ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

  • నేటి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌..
  • జిల్లాలో 10.61 లక్షల మంది ఓటర్లు.. 1,238 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • నవంబర్‌ 7న ఓట్ల లెక్కింపు.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

నంద్యాల, నవంబర్‌ 4 (ఆంధ్రప్రభ ప్రతినిధి): నంద్యాల జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా తెలిపారు. గురువారం (నవంబర్‌ 5) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో ఎన్నికల లెక్కలివీ..

నంద్యాల జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, 28 మండలాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 28 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 20 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 377 ఎంపీటీసీ స్థానాలకు గాను 224 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. జిల్లావ్యాప్తంగా పురుషులు, మహిళలు, ఇతరులు కలిపి మొత్తం 10,61,817 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 1,238 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..

ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తగిన సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించనున్నారు. అవసరమైన చోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమించడంతోపాటు వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో డ్రై డే..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. నవంబర్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్‌ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డ్రై డే అమల్లో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్‌ మున్సిపాలిటీలు, బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిని మినహాయించి మిగిలిన జిల్లా గ్రామీణ ప్రాంతాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. సంబంధిత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

నవంబర్‌ 7న ఓట్ల లెక్కింపు..

పోలింగ్‌ పూర్తయిన అనంతరం నవంబర్‌ 7వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లాలో ఆరు కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నంద్యాలలోని ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, డోన్‌లోని కేంద్రీయ విద్యాలయ–ఐటీఐ క్యాంపస్‌, నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బొమ్మలసత్రం ప్రాంతంలోని పీఎస్‌ అండ్‌ కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాల, ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.

రీపోలింగ్‌ అవసరమైతే 6న..

ఏదైనా కారణంతో ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే నవంబర్‌ 6వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.