అందరూ ఆరోగ్యంగా జీవించాలి

అందాల సుందరి డాక్టర్ మాలినీ దాసరి పిలుపు

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే తన ఆకాంక్ష అని అందాల సుందరి, వైద్యురాలు డాక్టర్‌ మాలినీ దాసరి అన్నారు. శుక్రవారం ఉదయం పెందుర్తి మండలం పెద్దగాడికి సమీపంలోని సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విశాఖపట్నంలోనే పుట్టి పెరిగి వైద్య విద్యను అభ్యసించానని, ఇటీవల అమెరికా అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా అధ్యక్షుల నుంచి అవార్డు అందుకున్నట్లు తెలిపారు. వైద్యశాలకే పరిమితం కాకుండా ‘వాక్‌ బియాండ్‌ ద వైట్‌ కోట్‌’ పేరుతో వివిధ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ఫ్యాకల్టీ అవార్డు ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ మెంటర్‌షిప్‌, హనరరీ అవుట్‌స్టాండింగ్‌ మెచ్యూర్‌ గర్ల్‌ హూ ఇన్‌స్పైర్స్‌, హనరీ షేడ్స్‌ ఆఫ్‌ సక్సెస్‌–2026, మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ–2025, మిసెస్‌ ఇండియా వరల్డ్‌–2025, మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ–2024, మిసెస్‌ లూసియానా యూనివర్స్‌–2024 వంటి గుర్తింపులు, అవార్డులు లభించాయని పేర్కొన్నారు. అయితే అవార్డులతో సంతృప్తి చెందకుండా సమాజానికి తనవంతు సేవ చేయాలనే తపనతో ముందుకు సాగుతున్నానన్నారు. తన పిల్లలకు తానే రోల్‌ మోడల్‌గా ఉండాలనే ఉద్దేశంతో వారిని వెంట తీసుకుని పర్యటిస్తున్నట్లు తెలిపారు.

అమెరికాలోని పలువురు మిత్రుల ద్వారా సంకల్ప కళా గ్రామం గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాను విన్నదానికంటే కళా గ్రామం ఎంతో బాగుందని ప్రశంసించారు. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు, ఆహార పదార్థాలు, సహజ రంగులతో తయారు చేసిన వస్త్రాలు, కొయ్య బొమ్మలు, కట్టె గానుగ నూనెలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఆకట్టుకున్నాయని తెలిపారు. మట్టితో తయారు చేసిన ప్రతిమల తయారీ ఆరోగ్యకరమైన ప్రక్రియ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మాలినీ దాసరి తల్లి దాసరి లక్ష్మీకుమారి, కుమార్తెలు జి. సమైక్య, జి. సమైన పాల్గొన్నారు. సంకల్ప కళా గ్రామం ప్రతినిధి పార్వతి, మాలినీ దాసరికి నూలు వస్త్రంతో, సహజ రంగులతో నేసిన శాలువా కప్పి సత్కరించారు. కళా గ్రామం వ్యవస్థాపకుడు ఆకుల చలపతిరావు, పర్యావరణ చైతన్యంపై పనిచేస్తున్న జమీలియా, ప్రకృతి రైతు నరేష్‌, యాక్షన్‌ ఎయిడ్‌ ప్రతినిధి ఐ. కృష్ణకుమారి, గ్రీన్‌ క్లైమేట్‌ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం, సమన్వయకర్త భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. సంస్థ సిబ్బంది, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.