పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన
- అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి..
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గాల వారీగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
అర్హులైన పట్టభద్రులను గుర్తించాలి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందన్నారు. 2023 నవంబర్ 1లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉన్న పట్టభద్రులను గుర్తించి వెంటనే ఓటరుగా నమోదు చేయించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ సానుభూతిపరులైన అర్హులైన పట్టభద్రుల్లో ఒక్కరి ఓటు కూడా నమోదు కాకుండా మిగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామ, వార్డు స్థాయిలో సమన్వయం
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పట్టభద్రులను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకునేలా కృషి చేయాలని అన్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు తదితర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.
యువతపై ప్రత్యేక దృష్టి
యువత, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు, వివిధ వృత్తుల్లో ఉన్న గ్రాడ్యుయేట్లను ప్రత్యేకంగా సంప్రదించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
