హైదరాబాద్, ఆగస్టు 21(ఆంధ్రప్రభ ) : విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విమర్శించారు. గురువారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్ లను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేసి అభినందించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22నెలలు అవుతున్నా విద్యాశాఖ కు మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు. వేలాది మంది విద్యార్థులను ప్రయివేట్ పాఠశాలల నిర్వాహకులు (Private school administrators) ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో సైతం ప్రోత్సహించేలా స్పోర్ట్స్ మీట్ లను నిర్వహించడమే కాకుండా టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు గత 30సంవత్సరాల నుండి అవార్డ్ లను అందజేయడం అభినందనీయమన్నారు. పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొట్టే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు.
అతి తక్కువ ఫీజులతో విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలను, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల నుండి ఒకే విధమైన పన్నులు వసూలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి (Work to solve problems) చేస్తానని హామీ ఇచ్చారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే పోరాడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం (Government) వచ్చిన తర్వాత నైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, అమీర్ పేట, ఖైరతాబాద్ మండలాల అసోసియేషన్ అధ్యక్షుడు ఆగస్తీన్, సుధాకర్, ఖుతుబుద్దీన్, ప్రసాద్, శివ ప్రసాద్, ప్రశాంత్ సీతా ఎవాజిలిన్, తదితరులు పాల్గొన్నారు.