Karepalli | మార్కింగ్‌తో మమ.. నోటీసులతో సరి..!

Karepalli | మార్కింగ్‌తో మమ.. నోటీసులతో సరి..!

డ్రైనేజీ మూసేశారు.. అధికారులు చూస్తున్నారు..!
ఆర్‌అండ్‌బీ మార్కింగ్.. పంచాయతీరాజ్ నోటీసులు.. చర్యలు ఎక్కడ..!
సైడ్ డ్రైనేజీకి సంకెళ్లు..! వ్యాపారుల ఇనుప జాలీల బంధనం..!


Karepalli | కారేపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రప్రభ): కారేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఆక్రమణలపై అధికారుల చర్యలు మార్కింగ్‌లు, నోటీసులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారి హద్దులను ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించి మార్కింగ్ చేసినప్పటికీ, ఆ తర్వాత ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి యథాతథంగా మారింది. దీంతో రహదారి భద్రత, డ్రైనేజీ వ్యవస్థపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఆక్రమణలపై అధికారులు దృష్టిసారించి రహదారి హద్దులను గుర్తిస్తూ మార్కింగ్ చేశారు. రహదారి పరిధిలో నిర్మాణాలు, వ్యాపార కార్యకలాపాలు చేపట్టకుండా హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీరాజ్ అధికారులు కూడా పలువురు వ్యాపారులకు నోటీసులు అందజేశారు. అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత ఆక్రమణలను తొలగించే దిశగా కఠిన చర్యలు కనిపించకపోవడంతో అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డ్రైనేజీకి ఇనుప జాలీల బంధనం..

ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న సైడ్ డ్రైనేజీలను కొందరు వ్యాపారులు ఇనుప జాలీలు, ఇతర నిర్మాణాలతో మూసివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలపై ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేయడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటమే కాకుండా, పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైనేజీ నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

మార్కింగ్ చేసినా.. తొలగింపెప్పుడు.?

ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి హద్దులను స్పష్టంగా గుర్తించిన నేపథ్యంలో ఆ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని ప్రజలు అంటున్నారు. కేవలం మార్కింగ్ చేసి, నోటీసులు ఇచ్చి వదిలేయకుండా ఆక్రమణలను గుర్తించి, నిబంధనల ప్రకారం తొలగించాలని కోరుతున్నారు.

అధికారుల సమన్వయం ఏది.?

రహదారి భద్రత, డ్రైనేజీ పరిరక్షణ, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లా అధికారుల పరిశీలన, ఆర్ అండ్ బి శాఖ మార్కింగ్, పంచాయతీరాజ్ నోటీసుల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు హద్దులు కాగితాలపై కాకుండా క్షేత్రస్థాయిలో అమలుకావాలని, సైడ్ డ్రైనేజీలను ఆక్రమణల నుంచి విముక్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.